
విశాఖపట్నంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ప్రతిష్టాత్మక ‘ఆంధ్ర మండపం’ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. భారీ సదస్సులు, ప్రదర్శనలు, సమావేశాలతో పాటు విలాసవంతమైన వసతి సదుపాయాలు కూడా ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
తొలి దశలో సుమారు 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఒకేసారి ఐదు వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయనున్నారు. అంతర్జాతీయ సమావేశాలు, భారీ కార్యక్రమాలకు వేదికగా నిలిచేలా ఆంధ్ర మండపాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
విశాఖపట్నం ఖ్యాతిని మరింత పెంచే మరో ప్రతిష్టాత్మక నిర్మాణం త్వరలో అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ స్థాయి సదస్సులు, భారీ ప్రదర్శనలకు వేదికగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్ర మండపం’ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సదుపాయాలతో పాటు ప్రత్యేకమైన నిర్మాణ శైలిలో ఈ ప్రాజెక్టును రూపొందించనున్నారు.
విశాఖ నగర పరిధిలోని కాపులుప్పాడ కొండపై, సముద్ర మట్టానికి సుమారు 120 మీటర్ల ఎత్తులో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 24 ఎకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) విధానంలో నిర్మాణ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. మరోవైపు ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా అధికారులు ఏడు విభిన్న డిజైన్లతో ఆకర్షణీయమైన త్రీడీ నమూనాలను సిద్ధం చేశారు.
ఆంధ్ర మండపం’ను కేవలం ఒక కన్వెన్షన్ సెంటర్‌గా కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమగ్ర వేదికగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీ సదస్సులు, ప్రదర్శనలు, సమావేశాలతో పాటు విలాసవంతమైన వసతి సదుపాయాలు కూడా ఒకే ప్రాంగణంలో కల్పించేలా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు.
తొలి దశలో సుమారు 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఒకేసారి ఐదు వేల మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది. అత్యాధునిక ఆడియో, విజువల్ సాంకేతికతతో పాటు ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్లు ఈ ఆడిటోరియానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రత్యేక ఎగ్జిబిషన్ హాల్, ఫోర్ స్టార్ హోటల్
ప్రదర్శనల నిర్వహణ కోసం 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఎగ్జిబిషన్ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. విదేశీ ప్రతినిధులు, ప్రముఖ అతిథుల బస కోసం 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 250కి పైగా గదులతో కూడిన విలాసవంతమైన ఫోర్ స్టార్ హోటల్‌ను నిర్మించనున్నారు.
ఇక ప్రాంగణం వెలుపల ఉన్న 6.8 ఎకరాల స్థలంలో సుందరమైన పూల తోటలు, ఆకర్షణీయమైన వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయనున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలతో ప్రాంగణాన్ని తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా సందర్శకులు సముద్రపు అందాలను ఆస్వాదించేలా ప్రత్యేక వ్యూ పాయింట్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. దీంతో ఆంధ్ర మండపం అంతర్జాతీయ సమావేశాలకు వేదికగా నిలవడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే మరో ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది.
ప్రతిష్టాత్మక ‘ఆంధ్ర మండపం’ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిర్దేశిత గడువులో అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సును ఇదే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేలా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
ప్రకృతి అందాల నడుమ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న ఈ ‘ఆంధ్ర మండపం’ పూర్తయితే విశాఖపట్నం ఖ్యాతి మరింత పెరగనుంది. అంతర్జాతీయ సదస్సులు, వాణిజ్య సమావేశాలకు ప్రధాన వేదికగా మారడంతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. తద్వారా విశాఖపట్నం ప్రపంచస్థాయి వాణిజ్య, పర్యాటక కేంద్రంగా ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు ఏర్పడనున్నాయి.
