
D Spiritual: Nov 21: ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవానీ దీక్షలు.. 41 రోజులపాటు ఆధ్యాత్మిక సందడి
జై భవాని నామస్మరణతో మారుమోగనున్న కొండ.. నవంబర్ 20 నుంచి 24 వరకు మండల దీక్షా మాలధారణ డిసెంబర్ 24న కలశ జ్యోతి ఉత్సవం.. జనవరి 3న పూర్ణాహుతితో దీక్షల విరమణ
విజయవాడ: పరమ పవిత్రమైన భవానీ దీక్షలతో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శక్తి స్వరూపిణి, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి కనకదుర్గమ్మ అనుగ్రహం కోసం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే శ్రీ భవానీ మండల దీక్షలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహామండపం ఆరో అంతస్తులో భవానీ అమ్మవారి ప్రతిష్ఠాపనతో దీక్షా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 41 రోజులపాటు కఠిన నియమాలు పాటిస్తూ అమ్మవారి నామస్మరణలో గడిపేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై భవాని.. జై జై భవాని నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మారుమోగాయి.
ప్రత్యేక పూజలతో దీక్షల ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రధాన ఆలయం నుంచి మహామండపం ఆరో అంతస్తుకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వికె శీనా నాయక్ పాల్గొన్నారు. పూజల అనంతరం ఉప ప్రధాన అర్చకులు నాగరాజు శాస్త్రి భక్తులకు భవానీ దీక్షా మాలధారణ చేశారు. గురుభవానీలు, అర్చకుల ఆధ్వర్యంలో పలువురు భక్తులు మాలలు ధరించి దీక్షను స్వీకరించారు. తొలిరోజే వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలిరావడంతో మహామండపం దీక్షాధారులతో కిటకిటలాడింది.
కఠిన నియమాలతో భవానీ దీక్ష
భవానీ దీక్షను భక్తులు తమ శక్తి, సంప్రదాయాలకు అనుగుణంగా మండల, అర్ధమండల, 11 రోజుల దీక్షలుగా స్వీకరిస్తుంటారు. మండల దీక్షను 41 రోజులపాటు, అర్ధమండల దీక్షను 20 రోజులపాటు, మరికొందరు 11 రోజులపాటు ఆచరిస్తారు. దీక్షా కాలంలో భక్తులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, ప్రతిరోజూ రెండు పూటలా పూజలు నిర్వహించడం, అమ్మవారి నామస్మరణ, జపం చేయడం వంటి నియమాలను పాటిస్తారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ పవిత్రమైన జీవన విధానాన్ని అనుసరిస్తారు. ఆహారం, ఆచార వ్యవహారాల్లో నియమనిష్ఠలు పాటిస్తూ అమ్మవారి అనుగ్రహం కోసం దీక్షను కొనసాగిస్తారు. గురుభవానీలు సైతం దీక్షాధారులకు నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ మార్గనిర్దేశం చేస్తారు.
నవంబర్ 24 వరకు మండల దీక్షా మాలధారణ
దేవస్థానం ప్రకటించిన కార్యక్రమాల ప్రకారం నవంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షా మాలధారణ కార్యక్రమం కొనసాగనుంది. నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల దీక్షా మాలధారణ ముగియనుంది. అర్ధమండల దీక్షా మాలధారణ డిసెంబర్ 10న ప్రారంభమై, డిసెంబర్ 14న ముగియనుంది.
భవానీ దీక్షల ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 24న మార్గశిర పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.30 గంటలకు కలశ జ్యోతి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రామకోటలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి పవిత్ర శ్రీ శివపార్వతీ క్షేత్రం నుంచి కలశ జ్యోతి బయలుదేరి, నగర సంకీర్తనతో శ్రీ అమ్మవారి దేవస్థానానికి చేరుకోనుంది.
డిసెంబర్ 30 నుంచి దీక్షల విరమణ కార్యక్రమాలు
డిసెంబర్ 30వ తేదీ బుధవారం ఉదయం 6.30 గంటలకు శ్రీ భవానీ మండల దీక్షా విరమణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అగ్ని ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనవరి 3వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు బి. ధర్మారావు, ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎన్. రమేష్ బాబు, కే. గంగాధర్, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.
