ఏపీలో సైన్స్ ఫెయిర్ల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ ఫెయిర్ల నిర్వహణకు ఎస్సీఈఆర్టీ (SCERT) షెడ్యూల్ విడుదల చేసింది.
ఏపీలో సైన్స్ ఫెయిర్ల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ ఫెయిర్ల నిర్వహణకు ఎస్సీఈఆర్టీ (SCERT) షెడ్యూల్ విడుదల చేసింది. పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వైజ్ఞానిక ప్రదర్శనలను పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించడమే ఈ ప్రదర్శనల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

ఈ ఏడాది సైన్స్ ఫెయిర్లకు ‘వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ కోసం STEM’ అనే ప్రధాన అంశాన్ని ఎంపిక చేశారు. ఏఐ (AI), హరిత ఇంధనం, గణిత నమూనాలు, ఆరోగ్యం-పరిశుభ్రత, దేశీయ వ్యవసాయ పద్ధతులు, విపత్తు నిర్వహణ, గ్రామీణ పరివర్తన కోసం సైన్స్ అంశాలపై సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన (SISF-2027) విభాగంలో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులని విద్యాశాఖ స్పష్టం చేసింది.
షెడ్యూల్ ఇదే..
- పాఠశాల స్థాయి సైన్స్ ఫెయిర్: నవంబర్ 23 (నిర్వాహకులు: ప్రధానోపాధ్యాయులు)
- మండల స్థాయి సైన్స్ ఫెయిర్: నవంబర్ 25 (నిర్వాహకులు: ఎం.ఈ.ఓలు).
- జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్: నవంబర్ 28 నుంచి 30 వరకు (నిర్వాహకులు: డీఈఓ ఆధ్వర్యంలో జిల్లా సైన్స్ అధికారులు).
- రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్: డిసెంబర్ 10, 11 తేదీలలో (ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహణ)
ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఏడు అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేయనున్నారు. వీటిలో మూడు గ్రూప్ ప్రాజెక్టులు, రెండు వ్యక్తిగత ప్రాజెక్టులు, రెండు ఉపాధ్యాయ ప్రాజెక్టులు ఉంటాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా ప్రదర్శనలు నిర్వహించాలని ఆర్జేడీలు, డీఈఓలకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది
