
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2026-27 సీజన్‌కు సంబంధించి సీనియర్ పురుషుల జట్టు కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది. ఈ ఒప్పందాలు 2027 జూన్ 30 వరకు అమల్లో ఉండనున్నాయి. ఈసారి గతంలో అమల్లో ఉన్న కేటగిరీ విధానానికి స్వస్తి పలికి, ఫార్మాట్ల ఆధారంగా కాంట్రాక్టులను కేటాయించింది. మొత్తం 38 మంది ఆటగాళ్లకు చోటు కల్పించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సహా 13 మందికి నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన విషయాలను బయటపెట్టారనే ఆరోపణలు రిజ్వాన్‌పై రావడం కూడా చర్చనీయాంశమైంది. మరో విశేషమేమిటంటే.. ఈసారి ఏ ఒక్క ఆటగాడికీ మూడు ఫార్మాట్లలో కాంట్రాక్టు దక్కలేదు.
రిజ్వాన్‌తో పాటు గతంలో బి కేటగిరీలో ఉన్న సైమ్ అయూబ్, హసన్ అలీ కూడా కొత్త జాబితాలో చోటు కోల్పోయారు. మాజీ కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, నోమన్ అలీ, హుస్సేన్ తలత్, ఖుర్రమ్ షెహజాద్, ఖుషిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్లకు కూడా కాంట్రాక్టులు లభించలేదు.
బాబర్ ఆజమ్, సల్మాన్ ఆఘాలకు రెండు ఫార్మాట్లలో చోటు
స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, సల్మాన్ అలీ ఆఘాలకు టెస్టు, వన్డే ఫార్మాట్లలో కాంట్రాక్టులు దక్కాయి. ఇటీవల టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి చేపట్టిన బాబర్ నాయకత్వంలో పాకిస్థాన్ రెండేళ్ల విరామం తర్వాత టెస్టు సిరీస్ విజయం సాధించింది. మరోవైపు టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సల్మాన్ ఆఘాకు ఈ ఫార్మాట్లో కాంట్రాక్టు దక్కకపోవడం గమనార్హం.
అజాన్ అవైస్, సౌద్ షకీల్, మహ్మద్ అబ్బాస్, సాజిద్ ఖాన్లకు టెస్టు కాంట్రాక్టులు కేటాయించారు. అబ్రార్ అహ్మద్, అరాఫత్ మిన్హాస్, ఫఖర్ జమాన్, ఫహీమ్ అష్రఫ్, హారిస్ రవూఫ్, షాహీన్ అఫ్రిదిలకు వన్డే, టీ20 ఫార్మాట్లలో ఒప్పందాలు లభించాయి.
యువ ఆటగాళ్లకు డెవలప్మెంట్ కాంట్రాక్టులు
టీ20 కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్‌తో పాటు హసన్ నవాజ్, మాజ్ సదాకత్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిక్లకు టీ20 కాంట్రాక్టులు ఇచ్చారు. వీరితో పాటు భవిష్యత్తు జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 19 మంది యువ ఆటగాళ్లకు డెవలప్మెంట్ కాంట్రాక్టులు ప్రకటించారు. ఈ జాబితాలో తయ్యబ్ ఆరిఫ్, ఘాజీ ఘోరీ, ఉబైద్ షా, హునైన్ షా తదితరులు ఉన్నారు.
