ఎనిమిదేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో చోటుచేసుకున్న బాల్ టాంపరింగ్ వివాదం (సాండ్‌పేపర్ గేట్) ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై తాజాగా మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌లకు ఫాక్స్ స్పోర్ట్స్ షాక్ ఇచ్చింది. వీరిద్దరినీ తాత్కాలికంగా క్రికెట్ కామెంటరీ బాధ్యతల నుంచి తప్పించింది. తిరిగి ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

ఈ నిర్ణయంపై ఫాక్స్ స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ స్టీవ్ క్రాన్లీ స్పందించారు. “ఇటీవలి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే కొన్ని వారాల పాటు ఖవాజా, వార్నర్‌లకు కామెంటరీ బాధ్యతల నుంచి విరామం ఇస్తున్నాం. మా కామెంటరీ బృందంలోని సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఆస్ట్రేలియా వేసవి క్రికెట్‌ను ప్రేక్షకులకు అత్యుత్తమంగా అందించడమే మా ప్రధాన లక్ష్యం. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం” అని వెల్లడించారు.

మళ్లీ తెరపైకి సాండ్‌పేపర్ గేట్ వివాదం

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై చర్యలు తీసుకున్నారు. తాజాగా ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ ‘సబ్రో’లో ఈ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరగలేదని, కేవలం ముగ్గురు ఆటగాళ్లనే బాధ్యులుగా చేసి బలిపశువులను చేశారని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లకు కూడా శాండ్‌పేపర్ వ్యవహారం గురించి ముందే తెలుసని ఆరోపించాడు.

ఖవాజా వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. అప్పటి జట్టులో సభ్యులుగా ఉన్న ఆటగాళ్ల వాంగ్మూలాలను మరోసారి పరిశీలిస్తామని వెల్లడించింది. దీంతో ఎనిమిదేళ్ల నాటి బాల్ టాంపరింగ్ వ్యవహారం ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *