IND A vs PAK A: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. నేపాల్‌పై 306 పరుగుల భారీ విజయం సాధించిన ఇండియా-ఏ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. యూఏఈపై 61 పరుగులతో గెలిచిన పాకిస్థాన్-ఏ కూడా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. టోర్నీలో తొలి మ్యాచ్‌ల్లో రెండు జట్లూ విజయాలు సాధించినప్పటికీ.. వాటి గెలుపు తీరులో మాత్రం చాలా తేడా ఉంది. నేపాల్‌పై ఇండియా-ఏ 306 పరుగుల భారీ విజయాన్ని అందుకోగా.. పాకిస్థాన్-ఏ యూఏఈపై 61 పరుగుల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌ల ప్రదర్శన, జట్లలోని ఆటగాళ్ల బలాబలాలు చూస్తే భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది.

బ్యాటింగ్‌లో భారత్‌కు తిరుగులేని బలం

ఇండియా-ఏ జట్టులో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుశాగ్రా వంటి టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో పలువురికి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఆడిన అనుభవం ఉంది. నేపాల్‌తో తొలి మ్యాచ్‌లో ఓపెనర్లు వైభవ్, అభిషేక్ పెద్దగా పరుగులు చేయలేకపోయినా.. భారత్ 332 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ తిలక్ వర్మ 107, కుమార్ కుశాగ్రా 117 పరుగులతో సెంచరీలు చేశారు. చివర్లో సూర్యాంశ్ షెడ్గే 14 బంతుల్లోనే 36 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. దీన్ని బట్టి భారత బ్యాటింగ్‌లో ఎంత లోతు ఉందో అర్థం చేసుకోవచ్చు

పాకిస్థాన్ బ్యాటింగ్‌లో కనిపించిన లోపాలు

పాకిస్థాన్-ఏ జట్టు తొలి మ్యాచ్‌లో యూఏఈపై 245 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు షమిల్ హుస్సేన్ 62, మాజ్ సదాకత్ 53 పరుగులతో రాణించి తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో పాకిస్థాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. యూఏఈ జట్టు కూడా 184 పరుగులు చేయడంతో పాక్ బౌలింగ్‌లో కొన్ని బలహీనతలు బయటపడ్డాయి. అలీ రజా, సుఫ్యాన్ మోకిమ్ తలో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ.. మిగతా బౌలర్ల నుంచి మరింత మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది. ముఖ్యంగా కీలక బౌలర్ మొహమ్మద్ ఇమ్రాన్‌కు తొలి మ్యాచ్‌లో వికెట్ దక్కలేదు.

బౌలింగ్‌లోనూ భారత్‌దే పైచేయి?

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు చేసిన ప్రదర్శన ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక లాంటిది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ను కేవలం 26 పరుగులకే ఆలౌట్ చేశారు. ప్రిన్స్ యాదవ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది. మరోవైపు పాకిస్థాన్ బౌలింగ్‌లో అలీ రజా, సుఫ్యాన్ మోకిమ్ కీలకంగా కనిపిస్తున్నారు. అయితే భారత బ్యాటింగ్ లైనప్‌ను అడ్డుకోవాలంటే పాక్ బౌలర్లు తొలి నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు, పాక్ స్పిన్నర్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

గత ఫైనల్‌లో పాక్ విజయం

గతంలో 2023లో జరిగిన 50 ఓవర్ల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్-ఏ జట్టు భారత్-ఏపై 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి రెండు జట్లు 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే తలపడుతున్నాయి. అయితే ప్రస్తుత జట్ల కూర్పు, తొలి మ్యాచ్‌ల ప్రదర్శనను పరిశీలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉంది. వైభవ్, అభిషేక్, తిలక్, రింకూ వంటి ఆటగాళ్లు రాణిస్తే భారత్‌కు భారీ స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. పాకిస్థాన్ మాత్రం తన టాప్ ఆర్డర్‌పై ఆధారపడాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టుకే స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. అయితే భారత్-పాక్ మ్యాచ్‌లో చివరి వరకు పోరు ఎలా సాగుతుందో చెప్పడం కష్టం.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *