Indian Railways: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ప్రశాంతవంతమైన జర్నీని అందించడంలో భాగంగా అన్ని జోన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి రైళ్లల్లో గట్టిగా ఫోన్ మాట్లాడటం, గట్టిగా సౌండ్ పెట్టి సాంగ్స్, వీడియోలు మాట్లాడటం లాంటివి చేస్తే జరిమానా, జైలుశిక్ష విధించనుంది.
రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు చాలామంది తమ ఫోన్లలో గట్టిగా మాట్లాడటం, లౌడ్ స్పీకర్ పెట్టి సాంగ్స్ వినడం, వీడియోలు చూడటం వంటివి చేస్తుంటారు. దీని వల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి పనుల వల్ల కంపార్ట్మెంట్లలో ప్రశాంతత లేకపోవడంతో పాటు ఇతర ప్రయాణికుల ప్రైవసీకి భంగం కలుగుతుంది. అయితే ఇక నుంచి రైళ్లల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే రైల్వేశాఖ భారీగా జరిమానా విధించనుంది.

ఫోన్లలో పెద్ద సౌండ్‌తో రింగ్ టోన్ పెట్టుకోవడం, బిగ్గరగా మాట్లాడటం, సాంగ్స్ వినడం, వీడియోలు ప్లే చేయడం లాంటివి చేస్తే ప్రయాణికులకు భారీగా జరిమానా విధించనున్నారు. అంతేకాదు రైల్వే నిబంధనలు ఉల్లంఘించి తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు జైలుశిక్ష కూడా పడే అవకాశముంది. ఈ మేరకు అన్ని డివిజన్లకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.
కేవలం ట్రైన్ల లోపలే కాదు.. రైల్వే స్టేషన్లలో కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం, ప్రయాణికులు ప్రశాంతమైన ప్రయాణ సౌకర్యం కల్గించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులు తమ ఫోన్లను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ఇతర ప్రయాణికులకు ఇబ్బందిని కలగచేయవద్దని సూచించింది. రైల్వే బోర్డు సలహా మేరకు ఈ కొత్త రూల్స్ జారీ చేసినట్లు పేర్కొంది.
నిబంధనలను ఉల్లంఘించిన ప్రయాణికులపై రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 145 కింద చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. దీని ప్రకారం రూ.వెయ్యి వరకు జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ శిక్షలు విధించవచ్చు. నిబంధనలు పాటించని ప్రయాణికులపై రైల్వే సిబ్బంది చర్యలు తీసుకోవచ్చు. ఈ నిబంధనల గురించి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సమాచారం అందించేలా అనౌన్స్మెంట్లు చేస్తున్నారు.

ప్రయాణికులు ఇయర్ ఫోన్స్ ఉపయోగించాలని, ఫోన్లను సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్‌లో పెట్టుకోవాలని రైల్వేశాఖ సూచిస్తోంది. లేదా రింగ్ టోన్ తక్కువ వాల్యూమ్‌లో పెట్టుకోవాలని చెబుతున్నారు. ప్రయాణికులు అసౌకర్యాన్ని గురైతే రైలులోని రైల్వే సిబ్బందికి, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. లేదా రైల్‌మదాద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు
