ఆసియా కప్ ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నీలో భారత జట్టు పతకాల వేటను ఐదో స్థానంతో ముగించింది. తెలుగు ఆర్చర్ గణేశ్ మణిరత్నం, అదితి స్వామి రెండేసి పతకాలతో ఆకట్టుకున్నప్పటికీ.. భారత్‌కు ఒక్క స్వర్ణం కూడా దక్కలేదు. ఈ టోర్నీలో భారత క్రీడాకారులు మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించారు.

భారత్ సాధించిన ఆరు పతకాల్లో ఐదు కాంపౌండ్ విభాగంలో రాగా.. పురుషుల రికర్వ్ జట్టు మరో కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది.

గణేశ్‌కు రెండు రజతాలు

పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో తెలుగు కుర్రాడు గణేశ్ మణిరత్నం 146-148తో ఆస్ట్రేలియాకు చెందిన బెయిలీ వైల్డ్‌మన్ చేతిలో ఓడిపోయాడు. దీంతో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. టీమ్ విభాగంలోనూ గణేశ్, మానవ్ జాదవ్, మోహిత్ భాటి కలిసి రజత పతకాన్ని సాధించారు.

అదితికి రెండు పతకాలు

మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అదితి స్వామి ఫైనల్ వరకు చేరింది. అయితే చైనాకు చెందిన జింగ్వెన్ చేతిలో 144-146తో పరాజయం పాలై రజతం అందుకుంది. టీమ్ విభాగంలో అదితి, ప్రీతిక, తేజల్‌తో కూడిన భారత బృందం కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇదే విభాగంలో వ్యక్తిగతంగా ప్రీతిక కూడా కాంస్యాన్ని సాధించింది.

రికర్వ్‌లోనూ కాంస్యం

పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో ఉజ్వల్ ధామ, గోల్డీ మిశ్రా, అభ్యుదయ్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా ఆరు పతకాలతో టోర్నీని ముగించిన భారత్.. పతకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *