అవసరం ఉంటేనే బంగారం కొనుగోలు చేయాలంటూ గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఎంతో మందికి ఆర్థికంగా ఉపయోగపడిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) అభిప్రాయపడింది. బంగారం ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ముందుగానే కొనుగోళ్లు చేసి నష్టపోయే పరిస్థితి నుంచి ప్రజలను మోదీ హెచ్చరిక కాపాడిందని పేర్కొంది. ఈ మేరకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ సీటీఐ లేఖ రాసింది.

కిలో బంగారంపై రూ.65 లక్షల తగ్గుదల

సీటీఐ ఛైర్మన్ బ్రిజేశ్ గొయల్ తన లేఖలో బంగారం ధరల మార్పును ప్రస్తావించారు. ప్రధాని సూచన చేసిన సమయంలో కిలో బంగారం ధర సుమారు రూ.1.90 కోట్లుగా ఉండేదని, ప్రస్తుతం అది రూ.1.25 కోట్ల స్థాయికి పడిపోయిందని తెలిపారు. అంటే కిలోకు దాదాపు రూ.65 లక్షల మేర ధర తగ్గిందని వివరించారు.

అప్పట్లో ప్రధాని సూచనను పట్టించుకోకుండా భారీగా బంగారం కొనుగోలు చేసినవారు ప్రస్తుతం లక్షల రూపాయల నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నగల వ్యాపారులు, పెట్టుబడిదారులు అవసరానికి మించి బంగారం నిల్వ చేసుకోకుండా మోదీ పిలుపు ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు.

పెళ్లిళ్ల సీజన్‌లో కుటుంబాలకు ఊరట

బంగారం ధరలు తగ్గడంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోళ్లు చేయాలనుకునే కుటుంబాలకు కొంత ఊరట లభించిందని బ్రిజేశ్ గొయల్ తెలిపారు. ధరలు అందుబాటులోకి రావడం వల్ల మధ్యతరగతి ప్రజలకు కూడా నగలు కొనుగోలు చేసే అవకాశం పెరిగిందని పేర్కొన్నారు.

బంగారం కొనుగోళ్లపై మోదీ ఏమన్నారు?

లఖ్‌నవూలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ బంగారం ధరలపై గతంలో చేసిన సూచనను గుర్తుచేసుకున్నారు. ఈ ఏడాది మే నెలలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించారని, తద్వారా తమ డబ్బును ఆదా చేసుకోగలిగారని చెప్పారు.

అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని అప్పట్లో ప్రజలకు సూచించినట్లు వెల్లడించారు. తన మాట విన్నవారు ప్రస్తుతం డబ్బు ఆదా చేసుకున్నామని చెబుతున్నారని మోదీ వివరించారు. ఈ నేపథ్యంలోనే సీటీఐ ప్రధాని సూచనను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *