
గ్రామ సర్పంచ్ పదవుల కోసం అభ్యర్థులు ప్రకటిస్తున్న హామీలు, ఆఫర్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చందకచర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఆధ్యాత్మికవేత్త చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా తనను సర్పంచ్‌గా ఎన్నుకుంటే.. గ్రామ అభివృద్ధి కోసం తన సొంత నిధుల నుంచి ఏకంగా రూ.1.50 కోట్లు అందిస్తానని భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనుంజయ స్వామీజీ ప్రకటించారు. ఆయన చేసిన ఈ భారీ ఆఫర్ స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. సర్పంచ్ పదవుల కోసం అభ్యర్థులు ప్రకటిస్తున్న హామీలు, ఆఫర్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు భారీగా నగదు పంపిణీకి హామీ ఇస్తుంటే.. మరికొన్ని చోట్ల భూములు ఇస్తామంటూ ముందుకొస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో లాటరీ పద్ధతిలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఆధ్యాత్మికవేత్త సైతం సర్పంచ్ పదవి కోసం భారీ ఆఫర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చందకచర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనుంజయ స్వామీజీ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా తనను సర్పంచ్‌గా ఎన్నుకుంటే.. గ్రామ అభివృద్ధి కోసం తన సొంత నిధుల నుంచి రూ.1.50 కోట్లు అందజేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఈ మొత్తాన్ని నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తానని స్పష్టం చేశారు. స్వామీజీ ఇచ్చిన ఈ భారీ ఆఫర్‌తో చందకచర్ల పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
చందకచర్ల గ్రామంలో చాలాకాలంగా మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని చూసి చలించిపోయిన ధనుంజయ స్వామీజీ.. గ్రామ అభివృద్ధికి స్వయంగా నడుం బిగించారు. ఊరి రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చుల పేరుతో భారీగా డబ్బు వెచ్చించడం కంటే.. ఆ మొత్తాన్ని నేరుగా గ్రామ సంక్షేమానికి వినియోగిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీ బ్యాంకు ఖాతాలో జమ చేసే రూ.1.50 కోట్లతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల ఏర్పాటు చేపడతానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
పార్టీలకు అతీతంగా మద్దతు కోరుతున్న స్వామీజీ..
గ్రామంలో ఎన్నికల కారణంగా రాజకీయ విభేదాలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ధనుంజయ స్వామీజీ పిలుపునిచ్చారు. తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరుతూ టీడీపీ, వైఎస్సార్‌సీపీతో పాటు ఇతర స్థానిక రాజకీయ నాయకులను స్వయంగా కలిసి మద్దతు కోరనున్నట్లు వెల్లడించారు. గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ జెండాలు, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని గ్రామస్థులను కోరుతున్నారు.




