
టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలో ఉన్న సెంట్రల్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలకు అత్యాధునిక గార్డాసిల్-9 వ్యాక్సిన్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా అందిస్తున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్నవారికి ఈ టీకా వేయనున్నట్లు తెలిపారు.
టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. తిరుపతిలోని టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో ఈవో ముద్దాడ రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలకు అత్యాధునిక గార్డాసిల్-9 వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయనున్నారు. 9 నుంచి 25 ఏళ్లలోపు వారికి ఈ టీకా అందుబాటులో ఉంటుంది.
ఈ కార్యక్రమం కోసం తొలి విడతలో 2 వేల డోసులను టీటీడీ సేకరించింది. వ్యాక్సిన్‌కు మరింత డిమాండ్ ఉంటే అదనపు డోసులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు.
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌తో పాటు హెచ్‌పీవీ వైరస్ కారణంగా వచ్చే ఇతర క్యాన్సర్ల ముప్పును కూడా తగ్గించవచ్చని టీటీడీ సీఎంవో డాక్టర్ కుసుమకుమారి తెలిపారు. గార్డాసిల్-9 వ్యాక్సిన్ హెచ్‌పీవీకి చెందిన తొమ్మిది రకాల వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తుందని వివరించారు. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోసు కోసం టీటీడీ సుమారు రూ.3 వేల ఖర్చు చేస్తుండగా.. బయట మార్కెట్లో దీని ధర రూ.13 వేల నుంచి రూ.14 వేలకుపైగా ఉంటుందని తెలిపారు.
వ్యాక్సిన్ డోసుల విషయానికొస్తే.. 9 నుంచి 14 ఏళ్లలోపు వారికి మొదటి డోసు వేసిన ఆరు నెలల తర్వాత రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. 15 నుంచి 25 ఏళ్లలోపు వారికి మొదటి డోసు, రెండో నెలలో రెండో డోసు, ఆరో నెలలో మూడో డోసు వేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు.
ఎస్వీ గోశాలను సందర్శించిన పార్లమెంటరీ కమిటీ
మరోవైపు తిరుపతిలోని ఎస్వీ గోశాలను కేంద్ర సహాయ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ (పశుసంవర్ధక శాఖ) శనివారం సందర్శించింది. తిరుపతిలో నిర్వహించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం అనంతరం కేంద్ర సహాయ మంత్రి గోశాలను పరిశీలించారు.
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ (RGM) పథకం కింద నిర్వహిస్తున్న గోశాలలోని సౌకర్యాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. విశాలమైన, శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన షెడ్లు, పశువుల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన దాణా సరఫరా, నిర్వహణ విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ గోశాలలో ప్రధానంగా స్వదేశీ సాహివాల్ జాతి ఆవులను పెంచుతున్నట్లు అధికారులు వివరించారు. వీటి నుంచి సేకరించే స్వచ్ఛమైన పాలు, పెరుగు తదితర పాల ఉత్పత్తులను తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి పూజలు, అభిషేకాలకు అవసరమైన పాల ఉత్పత్తులను నాణ్యత, స్వచ్ఛతతో అందించడంలో ఎస్వీ గోశాల కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
గతంలో తాము సందర్శించిన సాధారణ గోశాలలతో పోలిస్తే.. ఎస్వీ గోశాల ఆధునిక సౌకర్యాలతో, శాస్త్రీయ విధానాల్లో అభివృద్ధి చెందడం అభినందనీయమని కేంద్ర సహాయ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్ అన్నారు. భవిష్యత్తులో ఈ గోశాల దేశంలోని ఇతర గోశాలలకు ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




