మీ దగ్గర ఇప్పటికీ పాత పేపర్ లేదా బుక్‌లెట్ తరహా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే దాన్ని కొత్త స్మార్ట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఇంట్లో నుంచే సారథి పరివాహన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ విధానం, అవసరమైన పత్రాలు, ఫీజులు, ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉందా? వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి..

మీ దగ్గర ఇప్పటికీ పాత బుక్‌లెట్ తరహా లేదా పేపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే దాన్ని కొత్త స్మార్ట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన సారథి పరివాహన్ (Sarathi Parivahan) పోర్టల్ ద్వారా ఈ సేవను పొందవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి

దేశంలో వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలామంది పాత పేపర్ లేదా బుక్‌లెట్ తరహా డ్రైవింగ్ లైసెన్స్‌లను ఉపయోగిస్తున్నారు. పాత తరహా లైసెన్స్‌లు కాలక్రమేణా పాడయ్యే అవకాశం ఉంటుంది. వాటిని భద్రపరచడం కూడా కొంత కష్టమే. ఇలాంటి సమస్యలను నివారించేందుకు పాత లైసెన్స్ స్థానంలో కొత్త స్మార్ట్ కార్డు పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

పాత డ్రైవింగ్ లైసెన్స్‌ను కొత్త స్మార్ట్ కార్డుగా మార్చుకోవాలనుకునే వారు ఈ కింది విధానాన్ని అనుసరించాలి.

  • ముందుగా సారథి పరివాహన్ అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి.
  • అందులో ‘Online Services’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • తర్వాత ‘Driving Licence Related Services’ పై క్లిక్ చేయాలి.
  • మీ రాష్ట్రం, సంబంధిత ఆర్టీఓ కార్యాలయాన్ని ఎంపిక చేసుకోవాలి.
  • ‘Services on Driving Licence’ విభాగంలోకి వెళ్లాలి.
  • అవసరాన్ని బట్టి ‘Replacement of DL’ లేదా ‘Renewal of DL’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • మీ పాత డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ (DOB) నమోదు చేయాలి.
  • అందుబాటులో ఉంటే ఆధార్ ఆధారిత ధ్రువీకరణ పూర్తి చేయాలి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • నిర్ణీత ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.

దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కొత్త స్మార్ట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్‌ను మీ రిజిస్టర్డ్ చిరునామాకు పోస్టు ద్వారా పంపిస్తారు.

ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందా?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి రావచ్చు. ముఖ్యంగా మీ పాత డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఆన్‌లైన్ రికార్డుల్లో అందుబాటులో లేకపోతే, లేదా రవాణా శాఖ అధికారులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోరితే వ్యక్తిగతంగా ఆర్టీఓ కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంటుంది. స్మార్ట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కోసం చెల్లించాల్సిన ఫీజు రాష్ట్రాన్ని బట్టి, సంబంధిత ఆర్టీఓ నిబంధనలను బట్టి మారవచ్చు. అలాగే దరఖాస్తు రకం, అవసరమైన సేవలను బట్టి కూడా ఛార్జీలు ఉండవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు సారథి పోర్టల్‌లో మీ రాష్ట్రానికి సంబంధించిన ఫీజులు, నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి. పాత డ్రైవింగ్ లైసెన్స్‌ను స్మార్ట్ కార్డుగా మార్చుకోవాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ సారథి పరివాహన్ పోర్టల్ ద్వారా వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *