
D Spiritual: Nov 23: నవంబర్ 24న తిరుమలలో సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన అనంతరం ఈ దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగిస్తారు. ఛత్రచామరాలు, మంగళవాయిద్యాల నడుమ దీపాలను ఊరేగింపుగా తీసుకెళ్లి విమాన ప్రదక్షిణం నిర్వహిస్తారు. అనంతరం ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి సమర్పిస్తారు.
ఆ తర్వాత ఆలయంలోని గర్భాలయం, అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి ఆలయం, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేయనున్నారు.
పౌర్ణమి గరుడ సేవ రద్దు
కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న దీపోత్సవం నేపథ్యంలో ప్రతి నెలా టీటీడీ నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసింది. అదేవిధంగా కార్తీక దీపోత్సవం కారణంగా ఆరోజు సహస్ర దీపాలంకరణ సేవను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.




