
ఆయుర్వేద సంస్థ ఏర్పాటు కోసం తిరుపతిని ఎంపిక చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఏకంగా రూ.350 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు ఈ క్యాంపస్ కేటాయింపు కోసం కేంద్ర ప్రభుత్వం 100 మార్కుల ఛాలెంజ్ మెథడ్‌ను అనుసరిస్తోంది. ఈ పోటీలో ఏపీతో పాటు మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తిరుపతికి ఈ సంస్థను కేటాయించేలా ఏపీ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రత్యేక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీంతో ఆయుర్వేద సంస్థ ఏర్పాటు విషయంలో తిరుపతికి అవకాశం దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది.
తిరుమల శ్రీవారి పాదాల చెంత ప్రతిష్టాత్మకమైన అఖిల భారత ఆయుర్వేద సంస్థ (AIIA) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తిరుపతిలో ఈ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది.
దేశవ్యాప్తంగా ఆయుర్వేద వైద్య విద్య, పరిశోధన, అత్యాధునిక చికిత్సా సదుపాయాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మూడు ఏఐఐఏ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యాంపస్‌లను దక్కించుకునేందుకు దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తిరుపతిలో ఒక క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండియన్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. తిరుపతిలో ఏఐఐఏ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, అందుబాటులో ఉన్న అనుకూలతలను వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఏఐఐఏ క్యాంపస్‌ల ఏర్పాటుకు పలు రాష్ట్రాలు పోటీపడుతున్న నేపథ్యంలో.. అనువైన ప్రాంతాలను ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 100 మార్కుల ఛాలెంజ్ మెథడ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పోటీలో ఉన్న రాష్ట్రాలు తమ ప్రతిపాదిత ప్రాంతాల్లోని అనుకూలతలను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో కూడిన నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది.
ఏఐఐఏ క్యాంపస్ ఏర్పాటుకు 50 నుంచి 100 ఎకరాల వివాదరహిత భూమిని ఉచితంగా కేటాయించాలి. ప్రతిపాదిత ప్రాంతానికి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా మెరుగైన రవాణా సదుపాయాలు ఉండాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 మెగావాట్ల విద్యుత్ కనెక్షన్, రోజుకు 1 ఎంఎల్డీ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. క్యాంపస్‌లో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు సమీపంలోనే పాఠశాలలు, కళాశాలలు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు సులభంగా చేరుకునే అవకాశం ఉండాలని కేంద్రం నిబంధనలు విధించింది.
తిరుపతికి అనుకూలతలు.. రూ.350 కోట్ల సాయం హామీ
తిరుపతిలో ఏఐఐఏ క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు షరతులు లేని ఆర్థిక సహాయంగా రూ.350 కోట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయం, ఇతర రాష్ట్రాలతో తిరుపతికి ఉన్న రవాణా అనుసంధానం, శేషాచలం అటవీ ప్రాంతం వంటి అంశాలను తన ప్రతిపాదనల్లో ప్రస్తావించింది.
ఇప్పటికే తిరుపతిలోని ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ సమీపంలో టీటీడీకి చెందిన 60 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. క్యాంపస్ కేటాయింపు జరిగిన వారం రోజుల్లోనే భూమిని అప్పగించగలమని తెలిపినట్లు తెలుస్తోంది.
ప్రతిపాదిత స్థలం ఎస్వీ యూనివర్సిటీకి 1.8 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు 5 కిలోమీటర్లు, విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు తిరుపతికి అదనపు బలంగా మారనున్నాయి. దీంతో ప్రతిష్టాత్మక ఏఐఐఏ క్యాంపస్ తిరుపతికి దక్కుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
అంతేకాకుండా, ఏపీ సింగిల్ విండో డెస్క్ పోర్టల్ ద్వారా ఒకే దరఖాస్తుతో మూడు వారాల నుంచి 30 రోజుల్లోగా అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది.
సంస్థ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు తాత్కాలిక ప్రాంగణాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఎస్వీ ఆయుర్వేద కళాశాల, దానికి అనుబంధంగా ఉన్న 200 పడకల బోధనాసుపత్రితో పాటు వేదిక్ యూనివర్సిటీలోని ఐదు అంతస్తుల భవనాన్ని తాత్కాలికంగా వినియోగించుకోవచ్చని సూచించినట్లు సమాచారం.
తిరుపతిలో ఏఐఐఏ క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన భూమి, నిధులు, మౌలిక సదుపాయాలు, అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం తన సంసిద్ధతను వెల్లడించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.




