
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ నాయకులు అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పూసపాటిరేగ మండలంలో వైస్ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి కూటమికి 13 మంది ఎంపీటీసీల మద్దతు ఉందని తెలిపారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఎన్నిక రెండో రోజు నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు.
2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలందరికీ తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఓటమిని తట్టుకోలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గజపతినగరం నియోజకవర్గంలో మొత్తం 76 ఎంపీటీసీ సెగ్మెంట్లకు గాను 66 స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారని కొండపల్లి శ్రీనివాస్ గుర్తుచేశారు. మిగిలిన స్థానాల్లోనూ స్వల్ప మెజార్టీతోనే కూటమి అభ్యర్థులు ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.




