హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి త్వరలోనే ఉపశమనం లభించే అవకాశం ఉంది. నగరంలోని ఐటీ కారిడార్‌లో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు మార్గానికి అనుసంధానంగా సుమారు 35 కిలోమీటర్ల మేర పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం డిసెంబరులో టెండర్లు పిలిచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక అందిన తర్వాత ప్రభుత్వ ఆర్థిక సహాయం, అవసరమైన భూకేటాయింపులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఐటీ కారిడార్‌లో ప్రయాణించే ఉద్యోగులు, నగరవాసులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రహదారులపై రద్దీ కూడా అధికమవుతోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వర్షాలు కురిసినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.

నగరంలో మెట్రో రైలు సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ.. స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు సరైన లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. దీంతో చాలామంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతోంది.

ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలుకు అనుసంధానంగా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా డిసెంబరులో టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికులకు చివరి మైలు కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీల ఏర్పాటుకు సంబంధించి అధికారులు కీలక కసరత్తు చేస్తున్నారు. ఎంపిక చేసిన మార్గాల్లో ఈ సర్వీసులను నడిపేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాల నివేదిక మరో వారం రోజుల్లో అందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు అమలుపై ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.

తొలిదశలో 35 కిలోమీటర్ల మేర పాడ్ ట్యాక్సీలు

ఐటీ కారిడార్‌లో మొదటి దశలో కూకట్‌పల్లి, రాయదుర్గం, బయోడైవర్సిటీ మీదుగా నాలెడ్జ్ సిటీ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మార్గంలో పాడ్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. మొదటి దశలో వచ్చే అనుభవాలను పరిశీలించిన అనంతరం రెండో దశలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రతిపాదిత మార్గాల్లో జనాభా, ట్రాఫిక్ రద్దీ, ఉపాధి అవకాశాలు, ఈ రవాణా వ్యవస్థ వల్ల ఎంతమంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందనే అంశాలపై అధ్యయనం నిర్వహించారు.

పీపీపీ విధానంలో ప్రాజెక్టు

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆర్థికంగా ప్రాజెక్టు ఎంతవరకు సాధ్యమవుతుందనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాతే టెండర్ల ప్రక్రియ ముందుకు సాగనుంది.

అధ్యయనం చేస్తున్న సంస్థ సమగ్ర నివేదిక అందించిన తర్వాత ప్రభుత్వం కొన్ని కీలక అంశాలను పరిశీలించనుంది. ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎంతవరకు అందించాలి? అదనంగా భూములు కేటాయించాల్సిన అవసరం ఉందా? వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ వివరాలన్నీ ఖరారైన తర్వాత టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న పాడ్ ట్యాక్సీల సాంకేతికత ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) కోసం వివిధ రకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. ఆయా దేశాల్లో స్థానిక పరిస్థితులు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విధానాల్లో ఈ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేశారు.

ప్రస్తుతం చైనాలోని నాంటాంగ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ట్రాక్‌లకు వేలాడే క్యాబిన్ల ద్వారా పాడ్ ట్యాక్సీ సేవలు అందిస్తున్నారు. అమెరికాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ, మార్గాంటౌన్‌లో ప్రత్యేక కాంక్రీట్ గైడ్‌వేలపై ప్రయాణించే పీఆర్‌టీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉంది. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో వివిధ టెర్మినళ్ల మధ్య ప్రయాణికులను చేరవేసేందుకు పాడ్ ట్యాక్సీలను ఉపయోగిస్తున్నారు.

నెదర్లాండ్స్‌లోని రివియం బిజినెస్ పార్క్‌లో రోడ్డు మార్గాలతో అనుసంధానమైన ఆటోమేటెడ్ పార్క్ షటిల్ వాహనాలు నడుస్తున్నాయి. దక్షిణ కొరియాలోని సున్‌చియోన్ బే పర్యాటక ప్రాంతంలో ఎలివేటెడ్ ట్రాక్‌లపై ప్రయాణించే పాడ్ కార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో ఏ టెక్నాలజీని ఎంచుకుంటారు?

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న పాడ్ కార్లకు సంబంధించి టెండర్లు దాఖలు చేసే సంస్థలే తాము వినియోగించబోయే సాంకేతికత వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆయా సంస్థలు ప్రతిపాదించే టెక్నాలజీ ఎంతవరకు సురక్షితమైనది, నగర పరిస్థితులకు ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అనే అంశాలను ప్రభుత్వ అధికారులు పరిశీలించనున్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల్లో అమలవుతున్న పీఆర్‌టీఎస్ సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు అనువైన టెక్నాలజీని ఎంపిక చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *