లోకకల్యాణం, సమాజ శ్రేయస్సు, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ విశాఖపట్నంలో 24వ శ్రీ అష్టలక్ష్మీ యాగాన్ని నిర్వహించనున్నారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 6 వరకు బిర్లా జంక్షన్‌లోని పాత కోకాకోలా సంస్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది. యాగం ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను శ్రీ అష్టలక్ష్మీ పీఠ వ్యవస్థాపక ఆచార్యులు శ్రీమాన్‌ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వెల్లడించారు.

2009లో అనకాపల్లి జిల్లా కొండకొప్పాకలో శ్రీ భగవద్రామానుజ సిద్ధాంత శ్రీ అష్టలక్ష్మీ పీఠాన్ని స్థాపించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 23 యాగాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, యుద్ధ వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు ఉపశమనం కలగాలనే సంకల్పంతో 24వ యాగాన్ని విశాఖలో చేపడుతున్నట్లు వివరించారు.

యాగ ప్రాంగణానికి మిథిలానగరంగా నామకరణం చేశారు. నవంబర్‌ 25న శోభాయాత్ర, 26న అంకురార్పణ, 27న అగ్ని ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ప్రధాన యాగశాలలో ఐదు హోమకుండాలతో మూలమంత్ర హవనం, ప్రతిరోజూ పూర్ణాహుతి, చివరి రోజు మహా పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి.

ఆరుగురు జీయర్‌ స్వాముల రాక

ఈ యాగానికి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్‌ స్వామి, త్రిదండి అహోబిల జీయర్‌ స్వామి, త్రిదండి అష్టాక్షరీ జీయర్‌ స్వామి, త్రిదండి దేవనాథ జీయర్‌ స్వామి, త్రిదండి శఠకోపముని జీయర్‌ స్వామి, త్రిదండి బృందావన జీయర్‌ స్వామి హాజరుకానున్నారు. త్రిదండి చిన్న జీయర్‌ స్వామి కూడా పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

నవంబర్‌ 28 నుంచి 30 వరకు పదో ఉభయ వేదాంత పండిత సభలు నిర్వహించనున్నారు. సంస్కృతం, తమిళ భాషల్లో ఆళ్వార్లు, మహనీయులు రచించిన ప్రబంధాలపై ప్రముఖ పండితులు ప్రవచనాలు అందించనున్నారు. ఈ సందర్భంగా శ్రీమాన్‌ మరంగంటి శ్రీ రంగాచార్య స్వామి శతవర్ష వేడుకలను కూడా నిర్వహించనున్నారు.

శ్రీ గాయత్రీ మహామంత్రంలోని 24 బీజాక్షరాలకు అనుగుణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో యాగాలు నిర్వహించాలనే సంకల్పంతో ఇప్పటికే 23 ప్రాంతాల్లో కార్యక్రమాలు పూర్తిచేశామని రఘునాథాచార్య స్వామి తెలిపారు. ప్రస్తుతం 24వ యాగాన్ని విశాఖలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఆరోగ్య, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలగాలనే సంకల్పంతో యాగంలోని ఇష్టి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *