వరుసగా నాలుగు వారాలుగా లాభాల్లో కొనసాగుతూ వచ్చిన భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీ లు సోమవారం ఉన్నట్టుండి కుప్పకూలాయి. ఒక దశలో 1,523.83 పాయింట్లు పతనమై 82,395.88 వద్ద..

సెన్సెక్స్‌ 1,484 పాయింట్లు పతనం

  • 451 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
  • సూచీలకు 4 నెలల్లో అతిపెద్ద నష్టం
  • రూ.5.19 లక్షల కోట్ల సంపద ఆవిరి
  • బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, లోహ రంగ షేర్లలో లాభాల స్వీకరణే కారణం

వరుసగా నాలుగు వారాలుగా లాభాల్లో కొనసాగుతూ వచ్చిన భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీ లు సోమవారం ఉన్నట్టుండి కుప్పకూలాయి. ఒక దశలో 1,523.83 పాయింట్లు పతనమై 82,395.88 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌.. చివరికి 1,483.72 పాయింట్ల (1.77ు) నష్టంతో 82,435.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 450.95 పాయింట్లు (1.75ు) కోల్పోయి 25,349.65 వద్ద ముగిసింది. నాలుగు నెలలకు పైగా కాలంలో (జూలై 8 తర్వాత) సూచీలకు ఇది అతిపెద్ద ఒక్కరోజు నష్టం. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, లోహ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు ప్రధాన కారణం. కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై ఆందోళనల తో అమెరికాతోపాటు ఆసియాలోని ఇతర మార్కెట్లు భారీగా నష్టపోవడం దలాల్‌ స్ట్రీట్‌లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీల నష్టాలను కొంత వరకు పరిమితం చేయగలిగాయి.

  • ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.19 లక్షల కోట్లు తగ్గి రూ.508.98 లక్షల కోట్లకు (5.48 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 22 నష్టపోగా.. టాటా స్టీల్‌ షేరు 8 శాతానికి పైగా క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది.
  • విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.5,672.99 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) రూ.2,760.12 కోట్ల నికర విక్రయాలు జరిపారు.

రూపాయి ర్యాలీకి బ్రేక్‌

వరుసగా ఐదు రోజులు బలపడుతూ వచ్చిన రూపాయి మళ్లీ జారుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసల నష్టంతో 92.85 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గడంతో పాటు డాలర్‌ బలహీనపడినప్పటికీ దేశీయ ఈక్విటీ మార్కెట్లో భారీ నష్టాలు మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

పసిడి మళ్లీ పెరిగే..

పది రోజులపాటు తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ ప్రియమైంది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు సోమవారం రూ.1,500 పెరిగి రూ.1,26,800కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.2,000 ఎగబాకి రూ.1.57 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడంతో పాటు పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో స్వర్ణాభరణాలకు గిరాకీ పెరగడమూ ఇందుకు కారణం. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఒక దశలో 3 శాతానికి పైగా పెరిగి 3,621 డాలర్లకు, సిల్వర్‌ 2.65 శాతం ఎగబాకి 42 డాలర్ల పై స్థాయికి చేరాయి.

యశోదా హాస్పిటల్స్‌ ఐపీఓ వాయిదా!

హైదరాబాద్‌కు చెందిన యశోదా హాస్పిటల్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. ఈ కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వహణ సంస్థ.. ఐపీఓ వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం లేకుండా కాన్ఫిడెన్షియల్‌ ఫైలింగ్‌ మార్గంలో సెబీకి 2025 సెప్టెంబరులో డీఆర్‌హెచ్‌పీ (డ్రాఫ్ట్ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్ట్‌స)ని సమర్పించింది. గత డిసెంబరులోనే సంస్థ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ మండలి ఆమోదం కూడా తెలిపింది. అయితే, పబ్లిక్‌ ఆఫరింగ్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టి, సంస్థలో 8-10 శాతం ఈక్విటీ వాటా విక్రయం ద్వారా ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అవసరమైన నిధులను సమీకరించాలని చూస్తున్నట్లు ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ మనీ కంట్రోల్‌ తన కథనం లో పేర్కొంది. వాటా విక్రయంలో భాగంగా కంపెనీ రూ.30,000 కోట్ల మార్కెట్‌ విలువను ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ లెక్కన, 10 శాతం వాటా విక్రయం ద్వారా సంస్థకు రూ.3,000 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది.

నేడు మార్కెట్లకు సెలవు: గురునానక్‌ జయంతి సందర్భంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లు బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలకు సెలవు. బుధ వారం మార్కెట్లు యథాతథంగా పనిచేస్తాయి.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *