
హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వస్తున్న ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. తాజాగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను మార్వెల్ విడుదల చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.
‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన రూసో బ్రదర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్లో కనిపించిన అద్భుతమైన విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి ఐరన్ మ్యాన్‌గా కాకుండా ప్రముఖ విలన్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే క్రిస్ హెమ్స్‌వర్త్, ఆంథోనీ మాకీ, వనెస్సా కిర్బీ, సెబాస్టియన్ స్టాన్, లెటీషియా రైట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రం 2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారత్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

