
హైదరాబాద్ మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌పై దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు.. పనుల నిలిపివేతకు నిరాకరించింది. ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట రూట్‌లో చేపడుతున్న మెట్రో పనుల వల్ల పాతబస్తీలోని చారిత్రక అక్కన్న మాదన్న ఆలయం సహా పలు హెరిటేజ్ కట్టడాలు దెబ్బతింటున్నాయని పిటిషనర్ ఆరోపించారు. అయితే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. వివాదానికి సంబంధించి పూర్తి ఆధారాలు, అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసిన హైకోర్టు.. విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగమైన ఎయిర్‌పోర్ట్ మెట్రో పనుల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పాతబస్తీ పరిధిలో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించిన హైకోర్టు.. దానిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపి ఒక సమగ్రమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫు లాయర్ ఇమ్మనేని రామారావు వాదనలు వినిపించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న మెట్రో నిర్మాణాలు చారిత్రక ప్రదేశాలు, ప్రాచీన అక్కన్న మాదన్న దేవాలయ ప్రాంగణాలకు నష్టం కలిగిస్తున్నాయని లాయర్ ఇమ్మనేని రామారావు ఆరోపించారు. తగిన కమిటీ అనుమతులు లేకుండానే ఈ పనులు చేపడుతున్నారని.. పనుల వల్ల నిర్మాణాలకు జరిగే నష్టాన్ని పరిశీలించడానికి ఒక అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించాలని కోరుతూ కొన్ని ఫోటోలను ధర్మాసనానికి అందించారు.
ఈ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు వాదనలు వినిపించారు. మెట్రో మార్గంలోని 102 హెరిటేజ్ కట్టడాలకు ప్రమాదం ఉందంటూ పిటిషనర్లు తప్పుగా చిత్రీకరిస్తున్నారని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు వల్ల కేవలం 3 వారసత్వ కట్టడాలపై మాత్రమే స్వల్ప ప్రభావం ఉంటుందని.. మిగిలిన ఏ నిర్మాణానికీ మెట్రో లైన్‌తో సంబంధం లేదని తెలిపారు.

