
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో కూటమి హైకమాండ్ స్పందించింది. ఇరువర్గాల వ్యాఖ్యలు కూటమికి నష్టం కలిగించేలా ఉన్నాయని భావించిన కూటమి పక్షాల సమన్వయ కమిటీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, పి. హరిప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నాయకులకు ఏవైనా ఆరోపణలు, అభ్యంతరాలు ఉంటే బహిరంగ విమర్శలకు దిగకుండా పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని కమిటీ సూచించింది. వివాదం మరింత ముదరకుండా మంత్రి అచ్చెన్నాయుడు దామచర్ల జనార్దన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు జనసేన అగ్రనేతలు బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడి సంయమనం పాటించాలని సూచించారు. కూటమి ఐక్యతకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దని, ఇలాంటి వివాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ఇరువురు నేతలకు హైకమాండ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
బాలినేనిపై దామచర్ల తీవ్ర ఆరోపణలు
ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దామచర్ల జనార్దన్.. బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాలినేని జనసేనను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తనపై 79 అక్రమ కేసులు పెట్టారని దామచర్ల పేర్కొన్నారు. బాలినేని, ఆయన కుమారుడిపై గతంలో పలు ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఒంగోలులోనే ఉండకుండా తరచూ వచ్చి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బార్ షాపుల వ్యవహారంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న తన ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. బాలినేని కూడా రావాలని సవాల్ చేశారు.
దామచర్లకు బాలినేని కౌంటర్
దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలకు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. తాను జనసేనలో చేరకపోతే జైలుకు పంపేవారని దామచర్ల అన్నారని గుర్తుచేస్తూ.. ‘‘దామచర్ల లోపల వేయిస్తే మాకు చేతకాదా?’’ అంటూ ప్రశ్నించారు.
ఇరువర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో కూటమి పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

