జొన్నలతో తయారుచేసే వెజ్ సూప్ రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలు అందించే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికగా నిలుస్తుంది. కూరగాయలు, జొన్నలను కలిపి తయారుచేసే ఈ వేడి వేడి సూప్ కడుపు నిండిన భావనను కలిగించడంలో సహాయపడుతుంది. సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే బరువు నియంత్రణకు కూడా తోడ్పడవచ్చు.
వర్షాకాలంలో వేడివేడి జొన్న వెజ్ సూప్
వర్షాకాలం లేదా చలికాలంలో సాయంత్రం వేళ వేడివేడిగా, కాస్త ఘాటుగా ఉండే పానీయం తీసుకోవాలని చాలామందికి అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మార్కెట్లో లభించే రెడీమేడ్ సూప్ ప్యాకెట్లకు బదులుగా ఇంట్లోనే ఆరోగ్యకరమైన సూప్ తయారు చేసుకోవచ్చు. మన వంటింట్లో సులభంగా లభించే సంప్రదాయ జొన్నలు లేదా జొన్నపిండితో రుచికరమైన వెజ్ సూప్‌ను తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు.

జొన్న వెజ్ సూప్‌కు కావాల్సిన పదార్థాలు
జొన్నతో తయారయ్యే ఈ వెజ్ సూప్ బరువు నియంత్రణపై దృష్టి పెట్టేవారికి మంచి ఎంపికగా ఉంటుంది. అయితే డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలు ఉన్నవారు తమ ఆహారంలో చేర్చే ముందు వైద్యుల సూచన తీసుకోవడం మంచిది.
కావాల్సిన పదార్థాలు:
- రెండు టీస్పూన్ల జొన్న పిండి
- ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి
- అర టీస్పూన్ జీలకర్ర
- అర టీస్పూన్ తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్
- సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్
- రెండు టేబుల్‌స్పూన్ల టమాటా ముక్కలు
- కొద్దిగా కరివేపాకు
- సుమారు అర లీటర్ నీరు
- తగినంత ఉప్పు
- అర టీస్పూన్ తాజాగా దంచిన మిరియాల పొడి
- తాజా కొత్తిమీర
- తగినంత నిమ్మరసం
ఈ పదార్థాలతో వేడివేడిగా, రుచికరమైన జొన్న వెజ్ సూప్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం
ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి దోరగా వేయించాలి. అనంతరం తాజాగా దంచిన అల్లం–వెల్లుల్లి ముద్దను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, టమాటా ముక్కలు, కరివేపాకు వేసి సుమారు రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. టమాటా ముక్కలు కాస్త మెత్తబడే వరకు ఉడికించాలి. రుచికి అనుగుణంగా క్యాప్సికం, క్యాబేజీ లేదా బఠానీలను కూడా జోడించుకోవచ్చు.

కూరగాయలు కొద్దిగా వేగిన తర్వాత సుమారు 400–500 మిల్లీలీటర్ల నీటిని పోయాలి. రుచికి సరిపడా ఉప్పు, తాజాగా దంచిన అర టీస్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. నీరు బాగా మరిగే వరకు ఉడికించాలి. మరోవైపు ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల జొన్నపిండిని తీసుకుని, పావు కప్పు నీటిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా చిక్కటి మిశ్రమంలా కలుపుకోవాలి.

ఇంట్లో జొన్నలు ఉంటే వాటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి జొన్నపిండిగా ఉపయోగించుకోవచ్చు. పాన్‌లోని నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని అందులో నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి. అనంతరం మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మరో 2–3 నిమిషాల పాటు మరిగించాలి.

జొన్నపిండి బాగా ఉడికి సూప్‌కి చక్కటి చిక్కదనం వచ్చిన తర్వాత, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆపేయాలి. అనంతరం ఒకటి లేదా రెండు చెంచాల నిమ్మరసం పిండి బాగా కలపాలి. అంతే, రుచికరమైన వేడివేడి జొన్న వెజ్ సూప్ సిద్ధం!
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా రాత్రి వేళ తేలికపాటి డిన్నర్‌గా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ సూప్ మంచి ఎంపికగా ఉంటుంది. వేడిగా తాగితే హాయిగా అనిపించడంతో పాటు, పోషకాలను అందించే ఆరోగ్యకరమైన పానీయంగా ఉపయోగపడుతుంది.

