
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మెగా డీఎస్సీ-2025 నియామకాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా కేవలం 148 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు వారిని ఫిన్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు పంపిస్తున్నామని చెప్పారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలాగా పెట్టి అవమానించారని లోకేష్ విమర్శించారు.
రిజర్వేషన్లపై స్పష్టత
డీఎస్సీ నియామకాల్లో రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం అమలు చేశామని నారా లోకేష్ తెలిపారు. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కోర్టుల్లో 336 కేసులు నమోదైనప్పటికీ చట్టపరమైన ప్రక్రియను కొనసాగిస్తూ నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేశామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అనుసరించిన పారదర్శక విధానంపై ఎంపికైన ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించేందుకు ముందుకు వచ్చారని మంత్రి వెల్లడించారు.
జగన్‌కు నారా లోకేష్ సవాల్
డీఎస్సీ నియామకాలపై వైకాపా అనవసర ఆరోపణలు చేస్తోందని నారా లోకేష్ మండిపడ్డారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి డీఎస్సీ నియామకాలపై చర్చకు సిద్ధం కావాలని లోకేష్ సవాల్ విసిరారు. అసెంబ్లీ వేదికపైనే కాకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ అంశంపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

