
మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారు సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో టీస్టాల్ ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందేలా ‘చాయ్ రాస్తా’ పేరుతో ఔట్‌లెట్లను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవి ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలో మరిన్ని ఔట్‌లెట్ల ఏర్పాటుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
‘ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త’ అనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. డీఆర్‌డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో ‘చాయ్ రాస్తా’ బ్రాండ్‌తో టీస్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఫ్రాంచైజీ తీసుకున్న వారికి కంటైనర్‌తో పాటు అవసరమైన సామగ్రిని అందిస్తారు. టీ, కాఫీతో పాటు బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ వంటి ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంటుంది.
టీస్టాల్ ఏర్పాటుకు అవసరమైన లొకేషన్ ఎంపిక, డాక్యుమెంటేషన్, లైసెన్సులు, మార్కెటింగ్, వ్యాపార శిక్షణ వంటి అంశాల్లో కూడా సహాయం అందించనున్నారు. డీఆర్‌డీఏ స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.4 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. PMEGP పథకం కింద రూ.4 లక్షల రుణం పొందితే రూ.1.40 లక్షల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది.
ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.5 వేల వ్యాపారం జరిగితే నెలకు సుమారు రూ.40 వేల వరకు ఆదాయం పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాపారం పెరిగే కొద్దీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అనంతపురం జిల్లాలో ఇప్పటికే 30 అనుకూల ప్రాంతాలను గుర్తించారు. టోల్‌గేట్లు, జాతీయ రహదారులు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ‘చాయ్ రాస్తా’ ఔట్‌లెట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సర్వే కొనసాగుతోంది.
తక్కువ పెట్టుబడితో మహిళలు సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందేందుకు ‘చాయ్ రాస్తా’ మంచి అవకాశంగా మారనుంది.

