
విజయవాడ: వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై సోమవారం మరింత స్పష్టతనిచ్చిన ఆయన.. శ్రావణమాసం మూడో శుక్రవారం విజయవాడ వేదికగా కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.
పార్టీ పేరు, జెండా, విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఇతర అంశాలను ఆ రోజు ప్రకటిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ప్రజా సమస్యలపై పోరాడేందుకు, వారి తరఫున గళం వినిపించేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు.
సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను నేరుగా చట్టసభల దృష్టికి తీసుకెళ్లేలా బలమైన స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని విజయసాయిరెడ్డి తెలిపారు.

