ఉదయం నిద్రలేవగానే తాగే వేడి టీ నుంచి రాత్రి పడుకునే ముందు ఆస్వాదించే స్వీట్ వరకు.. చక్కెర లేకుండా ఒక్కరోజును గడపడం చాలామంది భారతీయులకు కష్టమే. పండుగలు, వేడుకలకే పరిమితం కాకుండా స్వీట్లు, తీపి పదార్థాలు మన రోజువారీ ఆహారంలోనూ భాగమైపోయాయి. అయితే దేశంలో రోజుకు వినియోగమయ్యే చక్కెర పరిమాణం ఎంతన్నది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ తియ్యటి అలవాటు వెనుక దాగి ఉన్న చేదు వాస్తవాలు, అధిక చక్కెరతో కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గణాంకాల ప్రకారం భారత్‌లో ఏటా 28 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా చక్కెర వినియోగమవుతోంది. అంటే దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 75,000 నుంచి 80,000 మెట్రిక్ టన్నుల చక్కెర ఖర్చవుతున్నట్లు అంచనా. సగటున చూస్తే ఒక్కో వ్యక్తి రోజుకు దాదాపు 50 నుంచి 60 గ్రాముల చక్కెర తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ చక్కెరలో కొంత నేరుగా, మరికొంత పరోక్షంగా మన ఆహారంలోకి చేరుతోంది. టీ, పాలు, స్వీట్లు, మిఠాయిల ద్వారా నేరుగా చక్కెర తీసుకుంటుండగా.. కూల్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, బిస్కెట్లు, కేకులు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ స్నాక్స్ వంటి వాటి ద్వారా దాగి ఉన్న చక్కెర కూడా శరీరంలోకి చేరుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు సుమారు 25 గ్రాముల కంటే ఎక్కువగా ఫ్రీ షుగర్స్ తీసుకోకుండా ఉండటం మంచిది. అయితే భారతీయుల ఆహారపు అలవాట్లు, తీపి పదార్థాల వినియోగం, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై పెరుగుతున్న ఆధారపడటం కారణంగా చాలామంది ఈ పరిమితిని మించిపోతున్నారు.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జీవనశైలిలో వచ్చిన మార్పులు, ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్ వినియోగం పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ప్యాక్‌డ్ ఫుడ్స్‌లో ఉండే ‘హిడెన్ షుగర్’ కారణంగా తెలియకుండానే అధిక మొత్తంలో చక్కెర తీసుకునే అవకాశం ఉంది.
అధిక చక్కెర వినియోగం దీర్ఘకాలంలో ఊబకాయం, టైప్-2 మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, దంత క్షయం వంటి ఆరోగ్య సమస్యల ముప్పును పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల రోజువారీ ఆహారంలో చక్కెర పరిమాణాన్ని తగ్గించడం, ప్యాకేజ్డ్ ఆహారాల లేబుల్స్‌ను పరిశీలించడం, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం అవసరం.

