
అమెరికా గ్రీన్ కార్డ్‌పై భారతీయులకు భారీ నిరీక్షణ.. 179 ఏళ్ల వరకు వెయిటింగ్!
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు నిరీక్షణ మరింత సుదీర్ఘమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కొందరు భారతీయులు గ్రీన్ కార్డ్ పొందేందుకు 179 ఏళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో చైనాకు చెందిన దరఖాస్తుదారులకు ఈ నిరీక్షణ కాలం సుమారు 25 ఏళ్లుగా ఉండటం గమనార్హం.
ఇంత భారీ వ్యత్యాసానికి ప్రధాన కారణం అమెరికా గ్రీన్ కార్డ్ వ్యవస్థలోని దేశాల వారీ కోటా పరిమితులు, భారీ బ్యాక్‌లాగ్. ముఖ్యంగా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం ఏ ఒక్క దేశానికి నిర్దిష్ట పరిమితికి మించి వీసాలు ఇవ్వకూడదనే నిబంధన భారతీయ దరఖాస్తుదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
దీంతో అమెరికాలో చదువులు పూర్తి చేసి, ఉద్యోగాలు చేస్తూ గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులు ఏళ్ల తరబడి వెయిటింగ్‌లో ఉండాల్సి వస్తోంది.
భారతీయులకు గ్రీన్‌కార్డ్ కల ఇప్పట్లో నెరవేరేలా లేదు.. 179 ఏళ్ల వరకు వెయిటింగ్!
అమెరికాలో తాత్కాలిక వీసాపై అడుగుపెట్టి, అనంతరం శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డు పొందాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు ఎదురుచూపులు మరింత పెరగనున్నాయి. ఈ ఏడాది గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ నిపుణులు ఏకంగా 179 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి రావచ్చని తాజా నివేదిక వెల్లడించింది. మరోవైపు, చైనా నుంచి దరఖాస్తు చేసుకునే వారికి ఈ నిరీక్షణ కాలం సుమారు 25 ఏళ్ల వరకు ఉండొచ్చని పేర్కొంది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలపై అధ్యయనం చేసే నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) ఈ వివరాలను తన నివేదికలో వెల్లడించింది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (USCIS) అందించిన డేటాను విశ్లేషించి ఈ అంచనాలను రూపొందించింది.
ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కేటగిరీలైన EB-1, EB-2, EB-3లో ఉన్న వెయిటింగ్ లిస్ట్‌ను NFAP పరిశీలించింది. ఈ కేటగిరీల్లో పెరుగుతున్న వీసా బ్యాక్‌లాగ్, ప్రతి దేశానికి గ్రీన్‌కార్డుల జారీపై ఉన్న చట్టపరమైన పరిమితులు, అమెరికాలో విదేశీ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు ఇతర నైపుణ్యం కలిగిన నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాలు ఈ జాప్యానికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా భారతీయ నిపుణుల విషయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని NFAP తెలిపింది. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, గ్రీన్‌కార్డుల కేటాయింపులో ఉన్న పరిమితులు, ఇప్పటికే పేరుకుపోయిన దరఖాస్తుల కారణంగా వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరుగుతోంది.
దీంతో అమెరికాలో దీర్ఘకాలికంగా స్థిరపడాలని కోరుకునే భారతీయ నిపుణులకు గ్రీన్‌కార్డు పొందడం సుదీర్ఘ ప్రక్రియగా మారుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోతే, భవిష్యత్తులో వెయిటింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
