ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, చార్టులు లేదా కాగితపు సహాయం లేకుండానే కేవలం మానసిక లెక్కింపుతో 120 దేశాల స్థానిక సమయాలను కేవలం 5.14 నిమిషాల్లో చెప్పి గుజరాత్‌కు చెందిన 21 ఏళ్ల యశ్ హేమాంగ్ బక్షి అద్భుత ప్రపంచ రికార్డు సృష్టించారు. తీవ్రమైన ఏకాగ్రత, నిరంతర సాధనతో మానవ మెదడు అసాధారణ వేగంతో పనిచేయగలదని ఆయన తన ప్రతిభతో నిరూపించారు. అహ్మదాబాద్‌కు చెందిన యశ్ సాధించిన ఈ ఘనతను వరల్డ్ రికార్డ్ యూనియన్ అధికారికంగా గుర్తించింది.

మెదడుతోనే 120 దేశాల టైమ్ చెప్పిన యువకుడు.. ప్రపంచ రికార్డు!

చిన్న లెక్క చేయాలన్నా చాలామంది ఇప్పుడు ఫోన్‌లో కాలిక్యులేటర్‌ను ఆశ్రయిస్తున్నారు. ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ లేదా ఏఐ సహాయం తీసుకుంటున్నారు. కానీ అహ్మదాబాద్‌కు చెందిన 21 ఏళ్ల యశ్ హేమాంగ్ బక్షి మాత్రం తన మెదడు శక్తితోనే అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు.

ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, చార్టులు, కాగితం లేదా ఇతర సహాయాన్ని ఉపయోగించకుండా.. ప్రపంచంలోని 120 దేశాల్లో స్థానికంగా ఎంత సమయం ఉందో కేవలం 5.14 నిమిషాల్లో ఖచ్చితంగా చెప్పి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యశ్ తన అసాధారణ జ్ఞాపకశక్తి, గణన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలోని వివిధ టైమ్‌జోన్‌లతో పాటు, కొన్ని ప్రాంతాల్లో ఉండే అర్ధగంట, 45 నిమిషాల సమయ వ్యత్యాసాలను సైతం ఎలాంటి పొరపాటు లేకుండా లెక్కించాడు.

ఇంత తక్కువ సమయంలో 120 దేశాల స్థానిక సమయాలను ఖచ్చితంగా గుర్తించడం చూసి కార్యక్రమానికి హాజరైనవారు ఆశ్చర్యానికి గురయ్యారు. టెక్నాలజీపై ఆధారపడుతున్న ఈ రోజుల్లో.. కేవలం మెదడు శక్తితో యశ్ సాధించిన ఈ ఘనత అందరినీ ఆకట్టుకుంటోంది.

గతంలో భారత ప్రమాణ సమయాన్ని ఆధారంగా చేసుకుని 101 దేశాల స్థానిక సమయాలను కేవలం 14 నిమిషాల 42 సెకన్లలో లెక్కించి చెప్పిన యశ్.. ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో తన పేరును నమోదు చేసుకున్నాడు.

అయితే ఈసారి తన స్వంత రికార్డునే బద్దలు కొట్టి యశ్ మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఏకంగా 120 దేశాల స్థానిక సమయాలను కేవలం 5.14 నిమిషాల్లోనే చెప్పి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

యశ్ సాధించిన ఈ ఘనతను ‘వరల్డ్ రికార్డ్ యూనియన్’ ప్రతినిధి షరీఫా హనీఫా స్వయంగా పరిశీలించారు. అనంతరం యశ్ ప్రతిభను అధికారికంగా ధృవీకరిస్తూ ప్రపంచ రికార్డుగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *