
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో పవన్‌కు ఎంతో గౌరవం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలనను అందించడంలో ఆయన ముందుండి నడిపిస్తున్నారని ప్రశంసించారు. సమాజ సేవలో పవన్ కళ్యాణ్ మరింత కాలం కొనసాగాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ శుభాకాంక్షలకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మోదీ ఆప్యాయత, ప్రోత్సాహం ఏపీ ప్రజలకు మరింత నిబద్ధతతో సేవ చేయాలనే తన సంకల్పాన్ని బలపరిచిందన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను మోస్తూ సమైక్య భారత్ నిర్మాణం కోసం మోదీ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఎన్డీఏ సమిష్టి బలంతో సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నామని పవన్ తెలిపారు. ఏపీ, దేశ సేవలో తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ప్రధాని ఆశీర్వాదం, మార్గదర్శకత్వం కోరారు.
పవన్ కళ్యాణ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
