బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే, ఆలియా భట్ సాధించిన అరుదైన రికార్డ్ జాబితాలోకి ఇప్పుడు మాలీవుడ్ కుట్టీ మమితా బైజు కూడా చేరింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మూడు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల్లో భాగమైన హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది.

2013లో దీపికా పదుకొణే నటించిన యే జవానీ హై దీవానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్ లీలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల మార్క్‌ను అందుకున్నాయి. ఆ తర్వాత 2022లో ఆలియా భట్ కూడా గంగూబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర చిత్రాలతో ఇదే తరహా ఘనతను నమోదు చేసింది.

ఇప్పుడు వీరి సరసన మమితా బైజు పేరు కూడా వినిపిస్తోంది. ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ.. వరుస విజయాలతో తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటోంది.

ఈ ఏడాది మమితా నటించిన మూడు సినిమాలు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. జన నాయగన్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా దాదాపు రూ.300 కోట్లకు చేరువగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక ఆగస్టులో విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లహం కుడుంబ యూనిట్ చిత్రాలు కూడా భారీ కలెక్షన్లు నమోదు చేసినట్లు సమాచారం.

విశ్వనాథ్ అండ్ సన్స్ దాదాపు రూ.240 కోట్ల వసూళ్లు రాబట్టగా, బెత్లహం కుడుంబ యూనిట్ రూ.200 కోట్ల మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఒకే ఏడాదిలో మూడు రూ.200 కోట్ల సినిమాల్లో భాగమైన తొలి సౌత్ హీరోయిన్‌గా మమితా బైజు అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాల్లో కొన్ని ఏజ్ గ్యాప్ నేపథ్యంలో సాగే ప్రేమకథలు కావడం కూడా ఆసక్తిని పెంచుతోంది. వరుస విజయాలతో మమితా బైజు క్రేజ్ పెరగడంతో ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగినట్లు టాక్. ఇప్పటివరకు దాదాపు కోటి రూపాయల వరకు తీసుకుంటున్న ఈ బ్యూటీ.. ఇకపై ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

అయితే వరుసగా భారీ విజయాలు అందుకోవడం ఎంత ప్లస్ పాయింటో.. అదే స్థాయిలో తదుపరి సినిమాలపై అంచనాలను కూడా పెంచుతుంది. మమితా బైజు నుంచి రాబోయే చిత్రాలు ఈ జోరును కొనసాగిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ కేరళ కుట్టీ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *