డిసెంబర్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాల సందడి ఉండబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ డిసెంబర్ 24న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది.

అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లపై కొంతకాలంగా పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఫౌజీ’కి ఇంకా భారీ స్థాయిలో వర్క్ పెండింగ్‌లో ఉందని, అందువల్ల ప్రకటించిన తేదీకి సినిమా రావడం కష్టమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇక ‘దాదా’ విషయానికి వస్తే.. బాలకృష్ణకు గాయం కావడంతో షూటింగ్‌కు కొంత విరామం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమా కూడా డిసెంబర్‌లో కాకుండా వచ్చే సమ్మర్‌కు షిఫ్ట్ అవుతుందనే టాక్ మొదలైంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో పోస్ట్‌పోన్ ఆలోచన లేదని తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఓటీటీ డీల్స్ అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం డిజిటల్ హక్కుల విషయంలో ఓటీటీ సంస్థలు గతంలో కంటే కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ముందుగానే ఖరారు చేసి, అదే తేదీని ఒప్పందాల్లో పొందుపరుస్తున్నాయి. ఒకవేళ సినిమా విడుదల తేదీ మారితే.. ఓటీటీ డీల్‌పై ప్రభావం పడటంతో పాటు అగ్రిమెంట్‌లోని మొత్తంలో కోతలు విధించే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.

‘ఫౌజీ’, ‘దాదా’ సినిమాల డిజిటల్ హక్కులను ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ మార్చడం వల్ల ఎదురయ్యే ఆర్థిక, ఒప్పందపరమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. నిర్మాతలు ప్రకటించిన తేదీలకే సినిమాలను తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు టాక్.

దీంతో ప్రస్తుతం వినిపిస్తున్న వాయిదా వార్తలకు చెక్ పడినట్లేనని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3న, బాలకృష్ణ ‘దాదా’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి డిసెంబర్ బాక్సాఫీస్‌పై ఈ రెండు సినిమాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *