
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రాహుల్ ట్రేడ్ అవుతాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో జరిగిన పరిణామంతో ఆ ప్రచారానికి ఫుల్స్టాప్ పడినట్లైంది.
వచ్చే ఐపీఎల్ సీజన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫునే ఆడనున్నట్లు రాహుల్ తన స్పందన ద్వారా స్పష్టం చేశాడు. దీంతో డీసీ అభిమానుల్లో ఆనందం నెలకొంది.
కేఎల్ రాహుల్‌ను ప్రశంసిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. రాహుల్‌ను ‘క్లచ్ ప్లేయర్’గా అభివర్ణించిన ఆయన.. జట్టు కోసం ఇంకా సాధించాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే టీమ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆటగాడిగా రాహుల్‌ను కొనియాడారు.
“కేఎల్ రాహుల్ డీసీకి ఎంతో కీలకమైన ఆటగాడు. నాకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తుల్లో అతడొకడు. ఎప్పుడూ తనకంటే జట్టును ముందుగా ఉంచుతాడు. మా లక్ష్యం ఇంకా పూర్తికాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను గర్వపడే స్థాయికి తీసుకెళ్లేందుకు కలిసి పనిచేస్తాం” అంటూ పార్థ్ జిందాల్ పేర్కొన్నారు.
ఈ పోస్టుకు రాహుల్ స్పందిస్తూ “థ్యాంక్యూ.. రాబోయే సీజన్ కోసం ఎదురుచూస్తున్నా” అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ 2027లోనూ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలోనే కనిపించనున్నాడనే సంకేతం స్పష్టమైంది.
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్‌ను రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా రెండు సీజన్లలోనూ అతడు నిలకడగా రాణించాడు. 2025లో 539 పరుగులు సాధించిన రాహుల్.. 2026 సీజన్లో మరింత మెరుగ్గా ఆడి 593 పరుగులు నమోదు చేశాడు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరకముందు రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌కు మూడు సీజన్ల పాటు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆటగాడిగా కొనసాగుతున్న రాహుల్.. ఐపీఎల్ 2027లోనూ అదే జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు.
