యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. భుజానికి జరిగిన సర్జరీ కారణంగా కొంతకాలంగా షూటింగ్‌కు దూరంగా ఉన్న తారక్.. ఇప్పుడు మళ్లీ ‘డ్రాగన్’ సెట్స్‌లో అడుగుపెట్టినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ షూటింగ్ తిరిగి వేగం పుంజుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ‘డ్రాగన్’ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ గాయపడిన విషయం తెలిసిందే. భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు సర్జరీ చేయించుకున్న ఆయన.. కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ఈ కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో ఆలస్యం చోటుచేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం, సర్జరీ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ముందుగా కీలకమైన టాకీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని టాక్.

టాకీ పార్ట్ పూర్తైన అనంతరం భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ యాక్షన్ బ్లాక్స్‌ను భారీ స్థాయిలో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తారక్‌ను పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పలు కారణాలతో ‘డ్రాగన్’ షూటింగ్ ఆలస్యమైంది. తొలుత అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో రిలీజ్‌ను వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేసినట్లు సమాచారం. ఇక మరోసారి విడుదల తేదీ మారకుండా వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇకపై వరుస షెడ్యూల్స్‌తో షూటింగ్‌ను కొనసాగించనున్నట్లు టాక్.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఎన్టీఆర్ రీఎంట్రీతో షూటింగ్ మళ్లీ జోరందుకోవడంతో.. ‘డ్రాగన్’పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *