ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కీలక ముందడుగు పడుతోంది. గన్నవరం, అమరావతిలో రెండు మెగా రైల్ టెర్మినల్స్ ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్, యార్డు విస్తరణకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.

విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజూ భారీ సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుండటంతో స్టేషన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి పరిష్కారంగా గన్నవరంలో మెగా రైల్ టెర్మినల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే అమరావతిలో మరో మెగా టెర్మినల్ ఏర్పాటు, విజయవాడ రైల్వే స్టేషన్ యార్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు.

గన్నవరం మెగా రైల్ టెర్మినల్, విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌లో మూడు రైల్వే లైన్ల విస్తరణకు కలిపి సుమారు రూ.907 కోట్ల వ్యయం అవుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. గన్నవరం, అమరావతి టెర్మినల్స్‌తో పాటు విజయవాడ యార్డు విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌లను సిద్ధం చేసి త్వరలో రైల్వే బోర్డుకు పంపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు విజయవాడ రైల్వే స్టేషన్‌లోని 2, 3, 4 ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన రైల్వే లైన్లు ప్రస్తుతం పొడవు తక్కువగా ఉన్నాయి. దీంతో ఎక్కువ కోచ్‌లు ఉండే పొడవైన రైళ్లను ఈ ప్లాట్‌ఫామ్‌లపై పూర్తిస్థాయిలో నిలపడం సాధ్యం కావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మూడు రైల్వే లైన్లను విస్తరించనున్నారు.

లైన్ల విస్తరణ పూర్తయితే 2, 3, 4 ప్లాట్‌ఫామ్‌లపై 28 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు లేదా 24 ఐసీఎఫ్ కోచ్‌లు కలిగిన రైళ్లను నిలిపే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ, ప్రయాణికుల సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

By Ramya