బ్రిక్స్ కూటమి వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఈసారి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత మండపంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు సభ్యదేశాల అధినేతలతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.

ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాల ఉమ్మడి డిక్లరేషన్‌కు ఆమోదం లభించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇరాన్, యూఏఈ మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఇరు దేశాలను ఏకాభిప్రాయానికి తీసుకురావడంలో భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఉమ్మడి డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నలుగురు ప్రతినిధులను ఉటంకిస్తూ వెల్లడించింది. ఈ ప్రకటనలో ఏ దేశాన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించకుండా, ఏకపక్షంగా యుద్ధాలను రుద్దడాన్ని తీవ్రంగా ఖండించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు శిఖరాగ్ర సమావేశానికి హాజరైన సమయంలో ఈ ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. పశ్చిమాసియా వివాదంపై భిన్న వైఖరులు కలిగిన ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య ఉన్న విభేదాలను అధిగమించి, ఉమ్మడి ప్రకటనకు ఆమోదం లభించేలా సభ్య దేశాలు చర్చలు జరిపినట్లు వర్గాలు వెల్లడించాయి. ఈ డిక్లరేషన్‌ను బ్రిక్స్ నేతలు మరికొద్ది గంటల్లో అధికారికంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివాదాలకు పరిష్కారం చూపేందుకు చర్చలు, దౌత్యపరమైన మార్గాలే ఏకైక పరిష్కారమని డిక్లరేషన్‌లో స్పష్టం చేయనున్నట్లు సమాచారం. అన్ని సభ్య దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో భారత దౌత్యవేత్తలు, బ్రిక్స్ షెర్పాలు కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు.

ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాలపై ఉమ్మడి ప్రకటనలో ఉపయోగించాల్సిన పదజాలం విషయంలో సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో శిఖరాగ్ర సమావేశానికి ముందు కొన్ని రోజుల పాటు బ్రిక్స్ షెర్పాలు నిరంతర చర్చలు జరిపి, అన్ని దేశాల ఆమోదం పొందేలా కృషి చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

స్థిరత్వం, వినూత్నత, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే నినాదంతో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రస్తుత అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై కీలకంగా చర్చించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.

ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్థాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి.

2026 జనవరి 1న భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. గతంలో 2012, 2016, 2021 సంవత్సరాల్లోనూ భారత్ బ్రిక్స్‌కు అధ్యక్షత వహించింది. అంతేకాకుండా, 2026 నాటికి బ్రిక్స్ కూటమి ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తవుతుండటం ఈ ఏడాదికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *