
భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ గాయని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితకథ వెండితెరపైకి రాబోతోంది. ‘M.S. A Legacy On Screen’ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను చెన్నైలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ ఇచ్చారు.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. లాంచ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ సుబ్బులక్ష్మి జీవితాన్ని సినిమాగా ఆవిష్కరించడం గొప్ప ప్రయత్నమని అన్నారు. ఆమె సంగీతంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని, ఇలాంటి గొప్ప కథను తెరపైకి తీసుకురావడంలో భాగం కావడం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.
అలాగే రష్మికను ప్రత్యేకంగా అభినందించిన కమల్ హాసన్.. సుబ్బులక్ష్మి వంటి లెజెండరీ వ్యక్తి పాత్రను పోషించడం సాధారణ విషయం కాదన్నారు. అంచనాలను పక్కన పెట్టి సహజమైన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేయాలని ఆమెకు సూచించారు.
‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ చిత్రాలతో భావోద్వేగభరిత కథలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. సుబ్బులక్ష్మి బాల్యం, ఆమె సంగీత ప్రయాణం, దేశ విదేశాల్లో సాధించిన గుర్తింపు, వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన అంశాలను సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో రష్మికను ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో చూపించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
