యూకేలో భారత సంతతికి చెందిన సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసి, అతని బస్సును అపహరించిన ఘటన కలకలం రేపింది. టెల్ఫోర్డ్‌లోని మేడ్లీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 33 ఏళ్ల యెమెన్‌ జాతీయుడు అలీ బల్హాద్‌ డ్రైవర్‌పై దాడి చేసి బస్సును తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

సీసీటీవీ దృశ్యాల్లో నిందితుడు డ్రైవర్‌ గడ్డం పట్టుకుని లాగడం, తలతో దాడి చేయడం కనిపించింది. అనంతరం బస్సులోని కొన్ని వస్తువులను ధ్వంసం చేసి, డ్రైవర్‌ను బయటకు తోసేశాడు. బస్సును స్వాధీనం చేసుకున్న నిందితుడు రాంగ్‌ రూట్‌లో వేగంగా నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు.

ఈ ఘటనపై సాయంత్రం 6:37 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. పది నిమిషాల్లోనే వెస్ట్‌ మెర్సియా పోలీసులు, సాయుధ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దోపిడీ, ప్రమాదకరంగా వాహనం నడపడం తదితర ఆరోపణలపై అతడిని అరెస్ట్‌ చేశారు.

దాడిలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ఇతరులకు ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రత్యక్ష సాక్షులు, డాష్‌క్యామ్‌, సీసీటీవీ ఫుటేజ్‌ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *