దేశవ్యాప్తంగా బ్యాంకులు వరుసగా ఐదు రోజుల పాటు మూడపడనున్నాయి. దీంతో ఖాతాదారులు ముందే తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. ఈ మేరకు ఎస్బీఐ తమ ఖాతాదారులకు అలర్ట్ జారీ చేయగా.. మిగతా బ్యాంకులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు జారీ చేస్తున్నాయి.

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా బ్యాంకులు వరుసగా ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి. ఐదు రోజు పనిదినం అమలు చేయడంతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మె చేపడుతున్నారు. ఈ నెలలో సమ్మెకు దిగడం ఇది రెండోసారి. ఈ నెల రెండో వారంలో సమ్మె చేపట్టగా.. ఇప్పుడు మరోసారి అదే బాట పడుతున్నారు.

సెప్టెంబర్ 28,29,30వ తేదీల్లో దేశవ్యాప్తంగా మరోసారి సమ్మెకు దిగుతున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించాయి. 26వ తేదీ నాలుగో శనివారం, 27వ తేదీ ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు కాగా.. ఆ తర్వాత మూడు రోజులు సమ్మె వల్ల బంద్ కానున్నాయి. దీంతో మొత్తం వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు ఉండవ్.

వరుసగా ఐదు రోజులు బ్యాంకులు పనిచేయకపోవడం వల్ల ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. దీంతో బ్యాంక్ బ్రాంచ్‌లతో పని ఉన్నవారు ఇప్పుడు పూర్తి చేసుకోవడం మంచిది. ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల సెలవు రోజుల్లో ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా బంద్ కానున్నాయి. ఈ క్రమంలో ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్ జారీ చేసింది.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వల్ల బ్యాంకులు వరుసగా బంద్ కానున్నాయని, దీంతో ఖాతాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాల్లో ఓ పోస్ట్ చేసింది. సమ్మె తేదీకి ముందే ఖాతాదారులు తమ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచించింది. అత్యవసర నగదు అవసరాల కోసం ఏటీఎంలు, ఏడబ్ల్యూఎంలను వినియోగించుకోవాలంది.

కస్టమర్ సర్వీస్ పాయింట్ల సేవలను ఉపయోగించాలని ఎస్బీఐ సూచించింది. యూపీఐ, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపింది. ఈ అసౌకర్యాన్ని చింతిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. కస్టమర్లు తమకు సహకరించాలని కోరింది. సెప్టెంబర్ 11న ఉద్యోగులు సమ్మె చేపట్టగా.. ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఇప్పుడు మరోసారి ఆందోళనలు చేపట్టనున్నారు.
