మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో తన మార్కెట్‌ను మరింత విస్తరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఐ యామ్ గేమ్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందకపోవడంతో.. ప్రస్తుతం ఆయన ఆశలు రాబోయే సినిమాలపైనే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆకాశంలో ఒక తార’పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 2026లో పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే దుల్కర్ మరో ఆసక్తికర తెలుగు ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

దుల్కర్ కోసం కథ సిద్ధం చేస్తున్న యువ దర్శకుడు

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న కొత్త సినిమాను నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం. యువ దర్శకుడు రామ్ జగదీష్ ఈ ప్రాజెక్ట్ కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ డ్రాఫ్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి కథను దుల్కర్‌కు వినిపించనున్నట్లు నాని ఇటీవల కొచ్చిలో జరిగిన ‘ది ప్యారడైజ్’ ప్రమోషనల్ ప్రెస్‌మీట్‌లో హింట్ ఇచ్చినట్లు సమాచారం. కథ దుల్కర్‌కు నచ్చితే ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

నాని బ్యానర్‌లో వరుస భారీ ప్రాజెక్టులు

ప్రస్తుతం వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై పలు ఆసక్తికరమైన సినిమాలు రూపొందుతున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ జానకి’ కూడా ఈ నిర్మాణ సంస్థలోనే తెరకెక్కుతోంది. అలాగే ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్‌ను కూడా నాని నిర్మిస్తున్నారు.

మరోవైపు దుల్కర్ చేతిలో ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ కీలక ప్రాజెక్ట్‌గా ఉంది. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు డ్రామా నవంబర్‌లో పలు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో దుల్కర్ మరోసారి బలమైన విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

‘ది ప్యారడైజ్’తో నాని–దుల్కర్ అనుబంధం

నాని, దుల్కర్ సల్మాన్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఈ కారణంగానే నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ను దుల్కర్‌కు చెందిన వేఫెరెర్ ఫిల్మ్స్ సంస్థ కేరళలో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక నాని నిర్మాణంలో దుల్కర్ హీరోగా కొత్త సినిమా నిజంగా కార్యరూపం దాల్చితే.. టాలీవుడ్‌లో ఇది ఆసక్తికరమైన కాంబినేషన్‌గా నిలిచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *