
అనంతపురం: వినాయక చవితి సమయంలో గణనాథుల నిమజ్జనానికి నీళ్లు లేక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులతో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీ ప్రదేశాల్లోనే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు.
అయితే తాజాగా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పరిస్థితి మారింది. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఎండిపోయిన చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. దీంతో గణనాథుల నిమజ్జనం జరిగిన ప్రాంతాల్లోనే ప్రస్తుతం నీరు కనిపిస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిమజ్జనం సమయంలో నీటి కోసం ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకుంటున్న భక్తులు.. ఇప్పుడు అదే చెరువులు వర్షపు నీటితో కళకళలాడటాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనం చేసిన చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో ప్రకృతే గణనాథుడికి వీడ్కోలు పలికినట్లుగా ఉందని స్థానికులు భావిస్తున్నారు.
వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు, గ్రామస్తులకు కూడా చెరువుల్లోకి నీరు చేరడం కొత్త ఆశలు నింపుతోంది. ‘‘నిమజ్జనానికి నీళ్లు లేకపోయినా.. కొద్దిరోజులకే గంగమ్మ వినాయకుడి చెంతకు చేరింది’’ అంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
