విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అభిమానుల్లో కాస్త అయోమయం నెలకొంది. తాజాగా ఈ ప్రచారానికి చిత్రబృందం మరోసారి ఫుల్‌స్టాప్ పెట్టింది.

అదే సమయంలో సినిమా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తూ ఫస్ట్ సింగిల్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ అనే తొలి పాట సెప్టెంబర్ 22న విడుదల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

వెంకీ నుంచి మాస్ సాంగ్..

‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలతో వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘నారాయణమ్మ’ పాటపై కూడా ఆసక్తి నెలకొంది.

ఈ పాటకు ఎస్. థమన్ సంగీతం అందించారు. ‘నారాయణమ్మ’ అవుట్ అండ్ అవుట్ మాస్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా వెంకటేష్ తన మార్క్ ఎనర్జీతో వేసే స్టెప్పులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది.

రిలీజ్ డేట్‌పై క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడుతుందనే వార్తలకు నిర్మాత నాగవంశీ మరోసారి స్పష్టత ఇచ్చారు. సినిమా ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. దీంతో గాంధీ జయంతి, దసరా సీజన్‌లో వెంకటేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైంది.

ఇక సినిమాలో వెంకటేష్ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌పై మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఫస్ట్ సింగిల్‌గా రాబోతున్న ‘నారాయణమ్మ’ పాటతో ‘ఆదర్శ కుటుంబం’పై బజ్ మరింత పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది. మరి సెప్టెంబర్ 22న విడుదల కానున్న ఈ పాట ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *