నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ వివరాలు ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమా సెన్సార్ ప్రక్రియలో ఏకంగా 21 మార్పులు సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా హింసాత్మక సన్నివేశాలతో పాటు కొన్ని సంభాషణలు, రాజకీయ ప్రస్తావనల విషయంలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.

రాజకీయ డైలాగులపై మార్పులు?

‘ది ప్యారడైజ్’ కథలో రాజకీయ వ్యవస్థను ఉద్దేశించిన కొన్ని ఘాటైన సంభాషణలు, రాజకీయ నాయకుల పేర్ల ప్రస్తావన ఉన్నట్లు సెన్సార్ వివరాల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని డైలాగులు, పేర్లను తొలగించడం లేదా మార్చడం జరిగిందని సమాచారం. అయితే సినిమాలో ఎవరిని ఉద్దేశించి ఈ ప్రస్తావనలు ఉన్నాయనే విషయంలో అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

దీంతో సోషల్ మీడియాలో ‘ది ప్యారడైజ్’లో రాజకీయ అంశాలు ఏ స్థాయిలో ఉంటాయనే చర్చ మొదలైంది. శ్రీకాంత్ ఓదెల తన కథలో సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలను ఎలా చూపించారనేది సినిమా విడుదల తర్వాతే స్పష్టత రానుంది.

హింసాత్మక సన్నివేశాలకు కట్స్

సెన్సార్ ప్రక్రియలో సినిమాలోని కొన్ని రక్తపాతం, టార్చర్ సన్నివేశాలను కూడా తగ్గించినట్లు తెలుస్తోంది. అభ్యంతరకరంగా భావించిన పదాలను మ్యూట్ చేయడంతో పాటు, కొన్ని సన్నివేశాల్లో స్మోకింగ్‌కు సంబంధించిన విజువల్స్, సిగరెట్ బ్రాండ్ వివరాల్లోనూ మార్పులు చేసినట్లు సమాచారం.

మొత్తంగా సెన్సార్ సూచనల మేరకు 21 మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 25 సెకన్ల విజువల్‌ను పూర్తిగా తొలగించగా.. మరో 1 నిమిషం 25 సెకన్ల నిడివి ఉన్న కొన్ని దృశ్యాలను ఇతర విజువల్స్‌తో రీప్లేస్ చేసినట్లు సమాచారం.

దాదాపు మూడు గంటల రన్‌టైమ్

అన్ని మార్పులు పూర్తయిన తర్వాత ‘ది ప్యారడైజ్’ రన్‌టైమ్ 2 గంటల 54 నిమిషాల 4 సెకన్లుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు మూడు గంటల నిడివితో ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది.

1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా సెన్సార్ వివరాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

సెన్సార్ మార్పుల నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’లో దర్శకుడు ఎలాంటి కథను చూపించారనే ఆసక్తి మరింత పెరిగింది. మరి సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *