వినాయక చవితి వేడుకలు భారత్‌కే పరిమితం కాలేదు.. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావంతో విదేశాల్లో కూడా వినాయకుడికి ప్రత్యేక ఆలయాలు ఏర్పడ్డాయి. ఆయా దేశాల్లో గణపతిని ఏ పేర్లతో పిలుస్తారు? ప్రసిద్ధ గణేశ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక చవితి వచ్చిందంటే భారత్‌ అంతటా పండుగ సందడి నెలకొంటుంది. వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసి, చిన్న విగ్రహాల నుంచి భారీ గణపతి విగ్రహాల వరకు ఘనంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలంకరణలు, భక్తి కార్యక్రమాలతో పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు.

అయితే గణపయ్యపై భక్తి కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ వినాయకుడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో గణపతిని స్థానిక పేర్లతో పిలుస్తూ భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మరి విదేశాల్లోని ప్రముఖ గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సూర్య వినాయక ఆలయం – నేపాల్

నేపాల్‌లోని భక్తపూర్ ప్రాంతంలో సూర్య వినాయకుడికి అంకితం చేసిన పురాతన ఆలయం ఉంది. ఖాట్మాండు లోయలోని ప్రముఖ నాలుగు వినాయక క్షేత్రాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయానికి చేరుకోవడానికి కొంత దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నేపాల్‌లోని మరో ప్రముఖ గణపతి క్షేత్రంగా జల వినాయక ఆలయానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది.

శ్రీ సితి వినాయగర్ ఆలయం – మలేషియా

మలేషియాలోని సెలంగోర్ ప్రాంతంలో ఉన్న శ్రీ సితి వినాయగర్ ఆలయం గణపతి భక్తులకు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. పెటాలింగ్ జయ పరిసరాల్లో ఉన్న ఈ ఆలయాన్ని స్థానికంగా పీజే పిళ్లైయార్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక సింగపూర్‌లోని సిలాన్ రోడ్డులో ఉన్న శ్రీ సెంపగ వినాయగర్ ఆలయానికి కూడా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఆలయానికి చోళుల కాలంతో సంబంధం ఉన్నట్లు స్థానికంగా చెబుతారు.

శ్రీ వరతరాజ సెల్వవినాయక ఆలయం – నెదర్లాండ్స్

నెదర్లాండ్స్‌లోని డెన్ హెల్డర్ ప్రాంతంలో శ్రీ వరతరాజ సెల్వవినాయక ఆలయం ఉంది. దేశంలోని పురాతన గణపతి ఆలయాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీలంక నుంచి నెదర్లాండ్స్‌కు వలస వెళ్లిన తమిళులు 1991లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం.

ఐర్లాండ్‌లో వినాయక విగ్రహాలు

ఐర్లాండ్‌లోని కౌంటీ విక్లో ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వినాయకుడిపై భక్తి కలిగిన విక్టర్ లాంగ్ హెల్డ్ అనే వ్యక్తి అక్కడ గ్రానైట్ రాళ్లతో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు చెబుతారు. వీటిని తమిళనాడుకు చెందిన శిల్పులు రూపొందించినట్లు సమాచారం. కొన్ని విగ్రహాలు సుమారు ఐదు అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.

అమెరికాలో శ్రీ మహావల్లభ వినాయక ఆలయం

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న శ్రీ మహావల్లభ వినాయక ఆలయం గణపతి భక్తులకు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ గణపతి ఆలయాలు, విగ్రహాలు కనిపిస్తాయి. ఇలా భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో వినాయకుడిని భక్తులు ఆరాధిస్తున్నారు. దేశాలు, సంస్కృతులు మారినా.. గణపతిపై భక్తి మాత్రం అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *