
టెక్ రంగంలో మరో పెను మార్పు జరిగింది. 18 ఏళ్లకుపైగా దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్‌కు సీఈఓగా నాయకత్వం వహించిన శంతను నారాయణ్ పదవి నుంచి దిగిపోనున్నారు. టెక్ రంగాన్ని ఏఐ కుదిపేస్తున్న వేళ ఈ మార్పు జరుగుతుండటం గమనార్హం. నారాయణ నిర్ణయంపై తన స్కూల్‌మేట్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ప్రశంసలు కురిపించారు. ఆయనకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు.
భారత సంతతికి చెందిన మరో వ్యక్తి.. దిగ్గజ కంపెనీ సీఈఓ పదవి నుంచి దిగిపోతున్నారు. ఆయనే శంతను నారాయణ్. అమెరికాలోని దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన అడోబ్ ఇంక్‌లో చాలా ఏళ్ల తర్వాత నాయకత్వ మార్పు జరుగుతుంది. సుమారు 2 దశాబ్దాలుగా (18 ఏళ్లకుపైగా) అడోబ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సేవలందించిన శంతను నారాయణ్ ఇప్పుడు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీనికి సంబంధించి కంపెనీ తాజాగా ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రకటన వచ్చినా.. కొత్త సీఈఓ నియామకం తర్వాత శంతను తన బాధ్యతల నుంచి పూర్తి స్థాయిలో వైదొలుగుతారు. సీఈఓగా వైదొలిగినా.. ఆయన బోర్డు ఛైర్మన్‌గా మాత్రం కొనసాగుతారని పేర్కొంది.
శంతన్ నారాయణ్ వైదొలిగేందుకు కారణాన్ని స్వయంగా ఆయన కానీ.. సంస్థ కానీ ప్రకటించలేదు. ప్రస్తుతం ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (AI) ఐటీ/టెక్ రంగాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శంతను తప్పుకోవడం ఎన్నో సందేహాల్ని లేవనెత్తుతోంది. ‘సీఈఓ బాధ్యతల నుంచి మారాలనుకుంటున్నా. బోర్డుకు నా నిర్ణయాన్ని తెలియజేశా. బోర్డు కూడా దీనిని అంగీకరించింది. అయితే.. ఇది గుడ్‌బై మాత్రం అస్సలే కాదు. బోర్డు ఛైర్మన్‌గా కంపెనీ కోసం మరింత శ్రమిస్తూనే ఉంటా’ అని నారాయణ్ స్పష్టం చేశారు.

