ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలను మెరుగు పరచడమే లక్ష్యంగా మిషన్‌ కర్మయోగి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో మంగళవారం మిషన్ కర్మయోగి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

విజయవాడ, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలను మెరుగు పరచడమే లక్ష్యంగా మిషన్‌ కర్మయోగి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు (మంగళవారం) మిషన్ కర్మయోగి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో మిషన్‌ కర్మయోగి కార్యక్రమంపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ వర్క్‌షాప్‌లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ శిక్షణ సంస్థల కెపాసిటి బిల్డింగ్, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్‌, మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ భాగస్వామ్యంలో ముసాయిదా రూపకల్పన చేశారు.

ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా, ఆయా శాఖల పనితీరును మెరుగు పరిచేలా సన్నద్ధం అయ్యేలా కార్యాచరణ రూపొందించారు. మిషన్ కర్మయోగి కార్యక్రమం అనంతరం నెల్లూరు జిల్లా ఉదయగిరికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.

By Hemanth