విజయవాడలో నిర్వహించిన పాన్‌ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఐదు క్వాంటమ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్ సంస్థ రూపొందించిన ఈ కంప్యూటర్లను ‘క్యూ-శివ’ పేరుతో అభివృద్ధి చేశారు.

మినీ టెస్టింగ్ క్వాంటమ్ కంప్యూటర్ ల్యాబ్‌లుగా క్యూ-శివ కంప్యూటర్లు ఉపయోగపడనున్నాయి. దీంతో పాటు 4 కెల్విన్ ప్రాసెసర్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. క్యూ-శివ క్వాంటమ్ కంప్యూటర్ల రూపకల్పన, తయారీలో కీలక పాత్ర పోషించిన చండీగఢ్ యూనివర్సిటీ, క్యూబిట్ ఫోర్స్ ప్రతినిధులను చంద్రబాబు అభినందించారు.

‘మేక్ ఇన్ అమరావతి’ కాన్సెప్ట్‌తో క్యూ-శివ కంప్యూటర్లను రూపొందించినట్లు క్యూబిట్ ఫోర్స్ ప్రతినిధులు తెలిపారు. వీటి తయారీకి అవసరమైన కొన్ని కీలక కాంపొనెంట్లు మచిలీపట్నంలోనే లభిస్తున్నాయని సంస్థ సీఈఓ వెంకటసుబ్రమణ్యం వెల్లడించారు. ప్రపంచంలో కేవలం రెండు, మూడు ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండే కొన్ని ప్రత్యేక కాంపొనెంట్లు మచిలీపట్నంలో లభించడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధికి సీఎం చంద్రబాబు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని వెంకటసుబ్రమణ్యం అన్నారు. అనంతరం క్యూబిట్ ఫోర్స్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు సెల్ఫీ దిగారు.

By Rajini