D Educt: Oct 31: రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి.. క్లాస్‌ టీచర్‌ కన్నీటి పర్యంతం

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై చెట్లు నరికే రంపంతో జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పాఠశాల క్లాస్‌ టీచర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగానే ఈ దారుణం జరిగిందని వివరిస్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

మ్యాథ్స్‌ పాఠం చెబుతుండగా తరగతి గదిలోకి వచ్చి దాడి

ఘటన జరిగిన సమయంలో తాను విద్యార్థులకు గణిత పాఠం బోధిస్తున్నానని ఉపాధ్యాయురాలు తెలిపారు. ఆ సమయంలో ఓ వ్యక్తి చేతిలో ఏదో పరికరం పట్టుకుని నేరుగా తరగతి గదిలోకి వచ్చాడని చెప్పారు. ఏమీ మాట్లాడకుండా బాధిత విద్యార్థిని వద్దకు వెళ్లి రంపంతో దాడి చేయడం ప్రారంభించాడని వివరించారు.

తేరుకునేలోపే ఘోరం జరిగిపోయింది

ఈ హఠాత్పరిణామంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కొద్దిసేపు షాక్‌లో ఉండిపోయానని, తేరుకుని స్పందించేలోపే తన కళ్ల ముందే విద్యార్థినిపై దాడి జరిగిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *