D Educt: Oct 31: ఏఎస్‌ఓ విద్యార్హత నిబంధనపై అభ్యర్థుల ఆందోళన

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌ఓ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్దేశించిన విద్యార్హత నిబంధనతో పలువురు అభ్యర్థులు అనర్హులవుతున్నారు. ఈ నిబంధనలో మార్పులు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా అధికారులు స్పందించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏఎస్‌ఓ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గత నెల 15న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 13 నుంచి నవంబరు 2వ తేదీ వరకు అవకాశం కల్పించింది.

నోటిఫికేషన్‌ ప్రకారం.. అభ్యర్థులు కామర్స్‌, గణితం, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే స్టాటిస్టిక్స్‌ను ఒక పేపర్‌గా కనీసం ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం చదివి ఉండాలనే నిబంధన విధించారు.

అయితే, 2015-16 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు వార్షిక విధానం నుంచి సెమిస్టర్‌ (సీబీసీఎస్‌) విధానానికి మారాయి. గతంలో ఒక విద్యా సంవత్సరంలో బోధించిన సబ్జెక్టును, సిలబస్‌లో మార్పులు చేయకుండానే ఇప్పుడు ఒక సెమిస్టర్‌లో మాత్రమే బోధిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు కరిక్యులంలో చేసిన మార్పుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు చెబుతున్నారు.

ఈ సమస్యపై అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో విద్యార్హత నిబంధనపై స్పష్టత ఇవ్వాలని ఏపీపీఎస్సీ ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌ విభాగానికి లేఖ రాసింది. అయితే, పాత నిబంధనలనే కొనసాగించాలని ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సమాధానమిచ్చారు.

2015-16 నుంచి సెమిస్టర్‌ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్టాటిస్టిక్స్‌ను ఒక పేపర్‌గా ఏడాది పాటు చదవలేదనే కారణంతో అనర్హులవుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల విద్యా విధానంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని అర్హత నిబంధనలను సవరించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *