
ప్రముఖ నటి యమున తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన అనుభవాన్ని గతంలో ఓ కార్యక్రమంలో వెల్లడించారు. 2011 జనవరి 20న జరిగిన ఓ సంఘటనకు సంబంధించి తనపై అసత్య ప్రచారం జరగడంతో జీవితం పూర్తిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తప్పుడు ప్రచారం తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని, దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని గుర్తుచేసుకున్నారు.
తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఆవేదన
ఓ టీవీ ఛానెల్ తన ముఖాన్ని స్పష్టంగా చూపిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్‌లో మరో మహిళకు సంబంధించిన అభ్యంతరకరమైన, బ్లర్ చేసిన దృశ్యాలను ప్రసారం చేసిందని యమున తెలిపారు. ఆ దృశ్యాలు తనవేనని ప్రేక్షకులు భావించేలా కథనాన్ని రూపొందించారని చెప్పారు.
అంతేకాకుండా, ‘రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది’ వంటి పదాలను ఉపయోగిస్తూ తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌పైనా తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు.

వారం రోజుల పాటు నిద్రపోలేదు
ఈ ఘటన తర్వాత తాను తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయానని యమున వెల్లడించారు. దాదాపు ఏడాది పాటు, అంటే 2012 ఫిబ్రవరి వరకు తీవ్ర మానసిక వేదనను అనుభవించినట్లు చెప్పారు.
వారం రోజుల పాటు సరిగ్గా నిద్రపోలేదని, భోజనం చేయకుండా కాఫీ తాగుతూ కూర్చునేదాన్నని గుర్తుచేసుకున్నారు. తన పేరును, జీవితాన్ని, చివరికి అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడాన్ని కూడా అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో చికిత్స.. మళ్లీ అదే వార్తతో షాక్
పరిస్థితి మరింత విషమించడంతో మణిపాల్ ఆసుపత్రిలో మానసిక చికిత్స కోసం చేరినట్లు యమున తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ క్రమంగా కోలుకుంటున్న సమయంలో.. అదే తప్పుడు వార్తను మరోసారి టీవీలో చూడటంతో తీవ్రంగా కలత చెందానని చెప్పారు
ఆ సమయంలో గట్టిగా అరవడం, ఏడవడం, చికిత్సలో భాగంగా ఇచ్చిన మాత్రలను పడేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు వివరించారు. ఆ ఘటన తనపై ఎంతటి ప్రభావం చూపిందో ఈ అనుభవం తెలియజేస్తుందని పేర్కొన్నారు.
