క్షయవ్యాధి (టీబీ), ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలక పాత్ర పోషించనుందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, వేగంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ఎక్కువ మందికి స్క్రీనింగ్ అందించడంలో ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇటీవల జైపూర్‌లో జరిగిన 28వ జాతీయ ఛాతీ వైద్యుల వార్షిక సదస్సులో ఈ అంశంపై చర్చించారు. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన 2,000 మందికి పైగా వైద్యులు, పరిశోధకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఎక్స్‌రేల ద్వారా టీబీ గుర్తింపు

ఛాతీ ఎక్స్‌రేలు, సీటీ స్కాన్లను విశ్లేషించి అనుమానాస్పద లక్షణాలను గుర్తించడంలో ఏఐ ఆధారిత పరికరాలు సహాయపడతాయని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా రేడియాలజిస్టుల కొరత ఉన్న మారుమూల ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఢిల్లీలోని వల్లభాయ్ పటేల్ ఛాతీ వైద్య సంస్థ సంచాలకుడు డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఏఐ సాయంతో ఎక్స్‌రేలను విశ్లేషించడం వల్ల టీబీ గుర్తింపు కార్యక్రమాల పరిధి, సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణలోనూ..

ఊపిరితిత్తుల క్యాన్సర్ గుర్తింపులోనూ ఏఐ కీలకంగా మారుతోందని నిపుణులు పేర్కొన్నారు. సీటీ స్కాన్లను పరిశీలించి ఊపిరితిత్తుల్లోని అనుమానాస్పద గడ్డలను గుర్తించేందుకు ఈ సాంకేతికత వైద్యులకు తోడ్పడుతుందని వివరించారు. తద్వారా అవసరమైన తదుపరి పరీక్షలను త్వరగా నిర్వహించి, వ్యాధి నిర్ధారణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చన్నారు.

అయితే ఏఐ వైద్యులకు సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుందని, తుది నిర్ధారణకు వైద్యుల పరిశీలన తప్పనిసరి అని స్పష్టం చేశారు.

By Ramya